AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chess: భారతీయ చెస్‌లో అతనో ఆణిముత్యం.. వరల్డ్ నెంబర్ వన్‌ అయ్యేందుకు పూర్తి అర్హుడు: విశ్వనాథన్ ఆనంద్

మనదగ్గర చాలా మంది యువకులు ఉన్నారు. నేను ఇటీవలే ఒక అకాడమీని ప్రారంభించాను. అక్కడ నేను ప్రజ్ఞానానంద వంటి యువకులతో కలిసి పని చేస్తున్నాను. వారిని సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను.

Chess: భారతీయ చెస్‌లో అతనో ఆణిముత్యం.. వరల్డ్ నెంబర్ వన్‌ అయ్యేందుకు పూర్తి అర్హుడు: విశ్వనాథన్ ఆనంద్
44th World Chess Olympiad R Praggnanandhaa And Viswanathan Anand
Venkata Chari
|

Updated on: Apr 05, 2022 | 5:38 PM

Share

రమేష్‌బాబు ప్రజ్ఞానానంద(Rameshbabu Praggnanandhaa) భారతీయ చెస్‌(Indian chess)లో ఓ ఆణిముత్యం అని, అతను ప్రపంచ నం.1 కావడానికి నిజమైన పోటీదారు అవుతాడని, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్(Viswanathan Anand) అభిప్రాయపడ్డాడు. శుక్రవారం భారత్‌కు చెస్ ఒలింపియాడ్ ఆతిథ్య హక్కులను అధికారికంగా అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెస్ ఆటను శాసించగల అనేక మంది ప్రతిభావంతులు వెలుగులోకి రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పదహారేళ్ల ప్రజ్ఞానంద చెస్ గ్రాండ్‌మాస్టర్ (GM) అయిన ఐదవ-పిన్నవయస్కుడిగా నిలిచాడు. అలాగే ఇటీవల ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌లో ర్యాపిడ్ గేమ్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కార్ల్‌సెన్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడిగా పేరుగాంచాడు.

“ప్రజ్ఞానంద అత్యుత్తమ ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అతనికి అగ్రస్థానంలో చేరగల సామర్థ్యం ఉంది. త్వరలోనే అతను దీనిని సాధిస్తాడు. నా ఉద్దేశ్యంలో ప్రపంచ ఛాంపియన్‌గా మారగలడు” అని ఆనంద్ శుక్రవారం న్యూస్9 స్పోర్ట్స్‌తో అన్నారు.

“మనదగ్గర చాలా మంది యువకులు ఉన్నారు. నేను ఇటీవలే ఒక అకాడమీని ప్రారంభించాను. అక్కడ నేను ప్రజ్ఞానానంద వంటి యువకులతో కలిసి పని చేస్తున్నాను. వారిని సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను” అని పేర్కొన్నారు.

“చదరంగం ఆడే దేశాల్లో భారత్, ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచింది. మన దగ్గర చాలా ప్రతిభావంతులైన యువతరం ఉంది. వారిలో చాలా మంది టాప్ 50, టాప్ 20లో కూడా ప్రవేశించగలరని నేను నమ్ముతున్నాను” అని ఆనంద్ తెలిపారు.

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా రష్యాలో ఈ టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు FIDE ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 44వ ప్రపంచ చెస్ ఒలింపియాడ్‌‌ను భారత్‌లో నిర్వహించేందుకు ఓకే చెప్పింది. ఇది జులై 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరగనుంది. భారత్ తొలిసారిగా చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యమిస్తుండడంతో.. మన దేశంలో ఈ ఆట వృద్ధికి శుభసూచకమని ఆనంద్ అన్నారు.

“భారతదేశంలో పెద్ద ఈవెంట్‌లు జరగాలని మేం కోరుకుంటున్నాం. ఇది నిజంగా భారీ ఈవెంట్. భారతదేశంలో ఇంతకంటే పెద్ద చెస్ పండుగ ఇంకోటి ఉండదు. ఇది నా స్వస్థలంలో జరుగుతున్నందున నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.

1927 నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో 180 దేశాల నుంచి దాదాపు 2,000 మంది పాల్గొననున్నారు. ఇది 30 సంవత్సరాల తర్వాత ఆసియాలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు.

“భారతదేశానికి ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం పూర్తిగా అర్హమైనది. వ్యక్తిగతంగా, ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి మాస్కోను తొలగించినందుకు నేను నిరాశ చెందాను. శాంతిని పునరుద్ధరించేందుకు రష్యా ఆటగాళ్ళు తిరిగి వస్తారని నేను ఆశిస్తున్నాను” అని రష్యన్ FIDE ప్రెసిడెంట్ అర్కాడీ డ్వోర్కోవిచ్ న్యూస్9 స్పోర్ట్స్‌తో అన్నారు.

“నేను ప్రాథమికంగా సలహాదారునిగా ఉంటాను. నేను చెస్‌ను ప్రోత్సహించడానికి పని చేస్తాను. అభివృద్ధి చెందుతున్న రంగాలపై అభిప్రాయాన్ని, సూచనలను అందిస్తాను. నేను గతంలో కూడా FIDEకి సలహాదారుగా ఉన్నాను. కానీ, వాస్తవానికి ఇది ఎక్కువ బాధ్యతలతో కూడిన అధికారిక పాత్ర అవుతుంది. ఇది నేను ప్రస్తుతం చేస్తున్నదానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇది నా నైపుణ్యం ఉన్న ఏరియా. కాబట్టి బహుశా కొంచెం ఈజీగా ఉంటుంది” అని ఆనంద్ పేర్కొన్నారు.

“డ్వోర్కోవిచ్ నేతృత్వంలోని అద్భుతమైన జట్టుతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు ఈ క్రీడ కోసం చాలా చేశారు” అని తెలిపారు. ఆటగాడిగా అగ్రస్థానానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “నేను చెస్ ప్రపంచాన్ని నిశితంగా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను తదుపరి తరం భారత ఆటగాళ్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నందున ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు. ఈ రోజుల్లో, నేను తక్కువగా ఆడుతున్నాను. అన్ని ప్రధాన అధికారిక పోటీలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లను దాటాను” అని ఆనంద్ తెలిపారు.

Also Read: IPL 2022: కేఎల్ రాహుల్‌ భారీ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న ఆర్‌సీబీ సారథి.. కేవలం 5 అడుగుల దూరంలోనే..!

IPL Media Rights: ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో మొదలైన పోటీ.. పత్రాలు కొనుగోలు చేసిన 5 బడా కంపెనీలు..