AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లీసా స్టాలేకర్‌ పుట్టింది మన పుణెలోనే..!

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న అద్భుతమైన క్రీడాకారిణి.. ఈ ఘతన సాధించిన తొమ్మిదో మహిళా క్రికెటర్‌ ఆమె!

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ లీసా స్టాలేకర్‌ పుట్టింది మన పుణెలోనే..!
Balu
|

Updated on: Aug 27, 2020 | 3:50 PM

Share

ఆగస్టు 13, 1978న మహారాష్ట్రలోని పుణెలో ఓ అందమైన పాప పుట్టింది.. ఆ పాపను చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని పెంచి పెద్దచేసే అశక్తతకు కాసేపు బాధపడ్డారు.. బాధను దిగమింగుకుని ఆ పాపను శ్రీవత్స అనే ఓ అనాధశ్రమం ముందు వదిలి వెళ్లిపోయారు.. ఆ పాపను ఆశ్రమం నిర్వాహకులు అల్లారుముద్దుగా చూసుకున్నారు.. లైలా అనే నామకరణమూ చేశారు.. ఇదిలా ఉంటే అమెరికాలోని మిచిగాన్‌ నుంచి హరెన్‌, సూ అనే దంపతులు ఇండియాకు వచ్చారు.. ఓ బాబును పెంచుకోవాలన్న అభిలాషతో శ్రీవత్స ఆశ్రమాన్ని సందర్శించారు.. నిజానికి వారు బాబునే దత్తతకు తీసుకోవాలనుకున్నారు. కాకపోతే ఎవరినైనా ఇట్టే ఆకర్షించే ఆ పాప కళ్లను ముచ్చటపడిపోయారు.. మరో ఆలోచన లేకుండా ఆ పాపను అక్కున చేర్చుకున్నారు.. ఫార్మాలిటీస్‌ అన్ని పూర్తయ్యాక ఆ పాపను తీసుకుని అమెరికాకు వెళ్లిపోయారా దంపతులు.

లైలా కాస్తా అమెరికాకు వెళ్లాక లీసా అయ్యింది.. కొన్నాళ్లకు ఆ హరెన్‌, సూ దంపతులు అమెరికాను వీడి ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. అక్కడే సిడ్నీ నగరంలో సెటిలయ్యారు. హరెన్‌కు క్రికెట్‌ అంటే ప్రాణం.. ఆ ఇష్టంతోనే తన కూతురును కూడా క్రికెటర్‌ చేయాలనుకున్నాడు.. ఇంటి వెనకాల ఉన్న చిన్నపాటి స్థలంలో లీసాకు క్రికెట్‌లో మెళకువలు నేర్పాడు.. ఆ తర్వాత ఇంటిదగ్గరే ఉన్న మైదానంలో శిక్షణ తీసుకుంది.. అబ్బాయిలతో కలిసి ఆడింది.. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు క్రికెట్‌లో రాటుదేలింది.. ఆమె ప్రతిభను గమనించి న్యూ సౌత్‌వేల్స్‌ క్లబ్‌ ఆమెను సాదరంగా ఆహ్వానించింది.. ఇక అప్పట్నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.. 2001లో ఆస్ట్రేలియా తరఫున తొలి వన్డే ఆడింది.. రెండేళ్లకు టెస్ట్‌ల్లోనూ అడుగుపెట్టింది.. మరో రెండేళ్ల తర్వాత టీ-20 మ్యాచులూ ఆడింది..

సుదీర్ఘమైన క్రికెట్‌ కెరీర్‌లో లీసా నాలుగు ప్రపంచకప్‌లు ఆడింది. ఎనిమిది టెస్ట్‌ల్లో 416 పరుగులు చేయడంతో పాటు 23 వికెట్లను తీసుకుంది. 125 వన్డేలు ఆడిన లీసా అందులోనూ అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. 2,728 రన్స్‌ ప్లస్‌ 146 వికెట్లు సాధించింది.. 54 టీ-20 మ్యాచ్‌లు ఆడి 769 పరుగులు చేయడంతో పాటు , 60 వికెట్లు తీసుకుంది. వన్డేల్లో బ్యాటర్‌గా 1,000 పరుగులు చేయడంతో పాటు వంద వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డ్‌ని కూడా నెలకొల్పింది. ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం కూడా వహించింది. క్రికెట్‌ నుంచి తప్పుకున్నాక క్రికెట్‌ వ్యాఖ్యతగా అందరి ప్రశంసలు అందుకుంది.. టీమ్ కోచ్, క్రికెట్ అసోషియేషన్‌ మెంబర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది.. ఐసీసీ ర్యాకింగ్‌లను ప్రవేశపెట్టినప్పుడు ఆమె నంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా చాలా కాలం కొనసాగింది…

ఆమె లీసా స్టాలేకర్‌… అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించుకున్న అద్భుతమైన క్రీడాకారిణి.. ఈ ఘతన సాధించిన తొమ్మిదో మహిళా క్రికెటర్‌ ఆమె!