Asia Cup 2022: ఆసియాకప్‌లో మళ్లీ భారత్ వర్సెస్ పాకిస్తాన్.. టోర్నీలో టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే
ఆతిథ్య బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా, యూఏఈలతో సహా మొత్తం 7 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది.
భారత్ , పాకిస్థాన్‌ల మధ్య మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది . క్రికెట్ మైదానంలో హోరాహోరీగా తలపడేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. శనివారం (అక్టోబరు 1) నుంచి బంగ్లాదేశ్ వేదికగా మహిళల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆతిథ్య బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మలేషియా, యూఏఈలతో సహా మొత్తం 7 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. అక్టోబర్7న టీమిండియా, పాక్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 15న టైటిల్ పోరు జరగనుంది.
రేపు భారత్ వర్సెస్ శ్రీలంక..
కాగా ఈ టోర్నీలో అన్ని జట్లు మొత్తం 6 మ్యాచ్‌లు ఆడనున్నాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 4 జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రెండు సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్ల మధ్య అక్టోబర్ 15న టైటిల్ పోరు జరగనుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ జట్లు తలపడనున్నాయి. మరోవైపు తొలిరోజు రెండో మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య జరగనుంది. అక్టోబరు 7న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.
రికార్డులు టీమిండియా వైపే..
కాగా 2018లో జరిగిన చివరి ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. టీ20 ఫార్మాట్‌లో రెండుసార్లు, వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు ఆసియాకప్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా గాయం కారణంగా ఇంగ్లండ్ టూర్‌కు దూరంగా ఉన్న జెమీమా రోడ్రిగ్స్ తిరిగి టీమిండియాలోకి వచ్చింది. జెమీమా రాకతో మిడిలార్డర్‌లో జట్టు మరింత బలపడనుంది. అదే సమయంలో ఆసియా కప్ ప్రారంభానికి ముందే పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ ఫాతిమా సనా గాయం కారణంగా జట్టుకు దూరమైంది.
టీమిండియా షెడ్యూల్ ఇదే..
- అక్టోబర్ 1- భారత్ vs శ్రీలంక
- అక్టోబర్ 3- ఇండియా vs మలేషియా
- అక్టోబర్ 4- ఇండియా vs UAE
- అక్టోబర్ 7- భారత్ vs పాకిస్థాన్
- అక్టోబర్ 8- భారత్ vs బంగ్లాదేశ్
- అక్టోబర్ 10- భారత్ vs థాయిలాండ్
మ్యాచ్ లన్నీ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతాయి..
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..