టీ20ల్లో 11వేల పరుగుల మార్క్‌ను చేరిన విండీస్ ఆల్ రౌండర్.. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానం ఎవరిదంటే?
Kieron Pollard: పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన విండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్.. ఇప్పటివరకు 554 టీ 20 లు ఆడాడు.
Kieron Pollard: వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ టీ 20 చరిత్రలో 11,000 పరుగుల మార్కును దాటిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ గ్రూప్ గేమ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ వర్సెస్ ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మ్యాచులో 41 పరుగుల ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. పొలార్డ్ తోటి వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ తొలి స్థానంలో నిలిచాడు. విధ్వంసక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గేల్.. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో 14,108 పరుగులు సాధించాడు. పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచాడు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన విండీస్ ఆల్ రౌండర్ ఇప్పటివరకు 554 టీ 20 లు ఆడాడు. ప్రస్తుతం 11,008 పరుగులతో రెండవ స్థానానికి చేరుకున్నాడు. అలాగే 297 వికెట్లు కూడా తన పేరుతో లిఖించుకున్నాడు. దీంతో టీ 20 చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరుగాంచాడు. పొలార్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, కీరన్ పొలార్డ్‌లు మాత్రమే టోర్నెమెంట్ అసాంతం ఒకే ఫ్రాంచైజ్ తరపున ఆడుతున్నారు.
కీరన్ పొలార్డ్ ఇప్పటివరకు 171 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 150.87 స్ట్రైక్ రేట్‌తో 3,191 పరుగులు సాధించాడు. ఇందులో 63 మంది బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ చేర్చాడు. పొలార్డ్ 2020 సీజన్‌లో విజయవంతమైన ముంబై ఇండియన్స్ జట్టులో కీలకంగా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 191 స్ట్రైక్ రేట్‌తో చెలరేగాడు. సీపీఎల్ 2021 లో ట్రిబ్నాగో నైట్ రైడర్స్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. రైడర్స్ రెండు గేమ్‌లు గెలిచారు.