
Sunrisers Hyderabad squad 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాన్యానికి చెందిన కావ్య మారన్ జట్టు ఐపీఎల్ 2026లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో సిద్ధమైంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్ టూ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి పేలవమైన బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాల్‌గా మారనుంది.
ఈ ఇద్దరు ఆటగాళ్ల ఫామ్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026లోనే స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో వీరి బ్యాటింగ్ జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించింది. అభిషేక్ శర్మ వేగవంతమైన అర్ధశతకం చేయగా, ఇషాన్ కిషన్ కూడా కీలక పరుగులు చేసి జట్టును ముందుకు నడిపించాడు. ఈ ప్రదర్శనతోనే ఇద్దరూ టీ20 క్రికెట్‌లో అగ్రస్థానాలకు చేరుకున్నారు.
ఇషాన్ కిషన్ కథ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. జనవరి 25 వరకు ఆయన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 100లో కూడా లేడు. కానీ, టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో కేవలం 45 రోజుల్లోనే ప్రపంచ నంబర్ రెండు స్థానానికి చేరుకున్నాడు. టోర్నమెంట్‌లో మూడు అర్ధశతకాలతో మొత్తం 317 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
బీసీసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2026లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. రెండో మ్యాచ్ ఏప్రిల్ 2న కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉంటుంది. మూడో మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతుంది. నాలుగో మ్యాచ్ ఏప్రిల్ 11న న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరగనుంది.
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్సే, శివంగ్ కుమార్, క్రేనిస్ ఫులేత్రా, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వార్డ్స్, నితీష్ కుమార్, జీసన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, శివమ్ మావి ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..