IND vs NZ 3rd T20: హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన భారత్..గౌహతి పిచ్ మీద పరుగుల వరద పారుతుందా ?
IND vs NZ 3rd T20: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇప్పటికే నాగ్‌పూర్, రాయ్‌పూర్ మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు మూడో టీ20 గౌహతి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన ఉవ్విళ్లూరుతోంది.

IND vs NZ 3rd T20: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇప్పటికే నాగ్‌పూర్, రాయ్‌పూర్ మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు మూడో టీ20 గౌహతి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ కీలక పోరు కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కొన్ని భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యువ బౌలర్ హర్షిత్ రాణా జట్టు నుంచి తప్పుకోవాల్సి రావచ్చు.
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా రెండో టీ20లో ఆకట్టుకున్నప్పటికీ, మూడో మ్యాచ్‌లో అతను బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానుండటమే. రెండో టీ20లో బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. అయితే, గౌహతిలోని బార్సపరా స్టేడియంలో టీమిండియాకు అంత మంచి రికార్డు లేదు. ఇక్కడ ఆడిన 4 మ్యాచ్‌ల్లో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ఈ ప్రతికూల రికార్డును చెరిపివేయాలంటే సీనియర్ బౌలర్ బుమ్రా జట్టులో ఉండటం అత్యవసరమని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
హర్షిత్ రాణాతో పాటు స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ కూడా తుది జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గనుక ఫిట్‌గా ఉంటే, అతడిని జట్టులోకి తీసుకోవడం ఖాయం. అక్షర్ బ్యాటింగ్‌లోనూ లోయర్ ఆర్డర్‌లో బలాన్ని ఇస్తాడు కాబట్టి, కుల్దీప్ స్థానాన్ని అతను భర్తీ చేయవచ్చు. రెండో టీ20లో హర్షిత్ ఒక వికెట్, కుల్దీప్ రెండు వికెట్లు తీసి తమ వంతు పాత్ర పోషించినప్పటికీ.. జట్టు సమతూకం కోసం ఈ ఇద్దరినీ పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.
గౌహతి పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.. కాబట్టి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే వంటి పవర్ హిట్టర్లు ఫినిషర్లుగా ఉండటంతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ జోడీ మెరుపులు మెరిపిస్తే భారత్‌కు తిరుగుండదు. వరుసగా మూడో విజయం సాధించి సిరీస్ సీల్ చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఒకవేళ బుమ్రా, అక్షర్ ఇద్దరూ వస్తే బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది.
3వ టీ20లో భారత అంచనా జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ / కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా / హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
