Virat Kohli : ‘ఎప్పటికైనా ముగియాల్సిందే!’.. రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్
Virat Kohli : విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్, ఆటపై తనకున్న ప్రేమ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ 2026లో సెంచరీ సాధించిన అనంతరం కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా కోహ్లీలో అదే కసి కనిపిస్తోంది.

Virat Kohli : భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన కెరీర్ ముగింపు దశపై మనసులో మాట బయటపెట్టారు. 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా క్రీజులో పరుగెత్తుతూ, బంతిని బాదుతున్న కోహ్లీ.. ప్రతి క్షణాన్ని ఎందుకు ఆస్వాదిస్తున్నారో వివరించారు. ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అజేయ సెంచరీతో ఆర్‌సీబీని గెలిపించిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “నేను ఆడుతున్న ఈ ఆట ఏదో ఒకరోజు ఖచ్చితంగా ముగిసిపోతుంది.. అందుకే మైదానంలో ఉన్న ప్రతి సెకనును మనస్ఫూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను” అని కోహ్లీ ఉద్వేగానికి లోనయ్యారు.
టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా కోహ్లీలో అదే కసి కనిపిస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా బ్యాటింగ్ అంటే తనకు ప్రాణమని ఆయన చెప్పుకొచ్చారు. “ఇంతకాలం ఆడిన తర్వాత కూడా నా కోర్ ఫీలింగ్ మారలేదు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడటం నాకెప్పుడూ ఒక గౌరవంలాగే ఉంటుంది. నా జీవితమంతా నేను చేసింది ఇదే.. క్రికెట్ అంటే నాకు అమితమైన ఇష్టం. అందుకే బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా నా ఆత్మను అందులో పెడతాను” అని కోహ్లీ స్పష్టం చేశారు.
కెప్టెన్సీ భారం లేకపోవడంతో కోహ్లీ ఇప్పుడు మరింత స్వేచ్ఛగా తన ఆటను ఆస్వాదిస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించడమే తనకు కావాల్సిన అసలైన సవాల్ అని ఆయన తెలిపారు. “మైదానంలోకి వెళ్ళిన ప్రతిరోజూ నాకంటూ ఒక కొత్త లక్ష్యం ఉంటుంది. మ్యాచ్ ఒత్తిడిని అనుభవించడం, ఒత్తిడి ఉన్నప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడం నాకు ఇష్టం. అలాంటి పరిస్థితుల్లో గెలిచి బయటపడినప్పుడే ఒక మంచి ఆటగాడిగా, ఒక మంచి వ్యక్తిగా మనం ఎదుగుతాం. క్రీడలు మన వ్యక్తిత్వాన్ని మలుస్తాయి” అని కోహ్లీ తన అనుభవాన్ని పంచుకున్నారు.
అన్ని రికార్డులు, అంకెలు పక్కన పెడితే.. బ్యాట్ మధ్యలో బంతి తగిలినప్పుడు వచ్చే ఆ శబ్దం, ఆ అనుభూతి కోహ్లీకి ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తోందట. 193 పరుగుల కఠినమైన ఛేజింగ్‌లో వికెట్లు పడుతున్నా కోహ్లీ ఏమాత్రం బెదరలేదు. సింగిల్స్ తీస్తూ, గ్యాప్‌లో ఫోర్లు కొడుతూ జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చారు. “నాకు ఇప్పటికీ ఆ జాయ్ మిస్ కాలేదు. బ్యాట్ మధ్యలో బంతి తగిలినప్పుడు కలిగే ఆ ఆనందం కోసం నేను ఎంత కాలమైనా ఆడతాను. ఇదంతా దేవుడి దయ” అని విరాట్ తన ఇంటర్వ్యూను ముగించారు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా నాలుగు సీజన్లలో 500 పైగా పరుగులు చేసిన ఘనతను కూడా కోహ్లీ ఈ క్రమంలో అందుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
