AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi : ఐసీసీ రూల్స్ కాదట.. బ్రిటన్ చట్టాల వల్లే వైభవ్‌కు స్పెషల్ రూమ్

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల్లో అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. యూకే చైల్డ్ సేఫ్‌గార్డింగ్ చట్టాల కారణంగా అతనికి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ కేటాయించనున్నారు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించబోతున్నాడు.

Vaibhav Sooryavanshi : ఐసీసీ రూల్స్ కాదట.. బ్రిటన్ చట్టాల వల్లే వైభవ్‌కు స్పెషల్ రూమ్
Vaibhav Sooryavanshi (14)
Rakesh
|

Updated on: Jun 25, 2026 | 11:40 AM

Share

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వారంలో ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనే వైభవ్ భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ కుదరకపోయినా జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనైనా అతను బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఆంక్షలు.. ఎందుకంటే?

టీమిండియాలో చోటు దక్కించుకున్నప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ బ్రిటన్ పర్యటనలో తన సహచర సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పూర్తిగా పంచుకోలేడు. దీనికి కారణం ఐసీసీ రూల్స్ కాదు, బ్రిటన్ దేశంలో అమల్లో ఉన్న చైల్డ్ సేఫ్‌గార్డింగ్ చట్టాలు. బ్రిటీష్ చట్టాల ప్రకారం 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ అథ్లెట్లను పెద్దల చేంజింగ్ రూమ్‌లలో బట్టలు మార్చుకోవడానికి అనుమతించరు. వైభవ్ వయస్సు ప్రస్తుతం 15 ఏళ్లు మాత్రమే కావడంతో, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఐర్లాండ్ అతనికి ప్రతి స్టేడియంలోనూ ప్రత్యేకమైన ప్రైవేట్ చేంజింగ్ రూమ్‌లను కేటాయిస్తున్నాయి.

ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదు

మొదట్లో ఈ రూల్స్ ఐసీసీ, ఈసీబీ ప్రొటోకాల్స్ ప్రకారమే జరుగుతున్నాయని బ్రిటీష్ మీడియా ప్రచారం చేసింది. కానీ, ద్వైపాక్షిక సిరీస్‌లు ఐసీసీ పరిధిలోకి రావని, కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే వారి రూల్స్ వర్తిస్తాయని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి. అంతేకాకుండా 16 ఏళ్ల లోపు క్రికెటర్లకు సంబంధించి ఐసీసీ వద్ద ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవు. కాబట్టి ఇది పూర్తిగా యూకే స్థానిక చట్టాలకు సంబంధించిన అంశం. మ్యాచ్ జరుగుతున్న సమయంలో, టీమ్ మీటింగ్స్ అప్పుడు వైభవ్ భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొచ్చు.. కానీ మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ ముగిసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి మాత్రం తన సొంత ప్రైవేట్ రూమ్‌నే వాడాల్సి ఉంటుంది.

సచిన్ టెండూల్కర్ రికార్డుల బద్దలు

వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో బరిలోకి దిగితే, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 1989లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల 205 రోజుల వయసులో పాకిస్థాన్‌పై తొలి టెస్ట్ ఆడాడు. ఇప్పుడు వైభవ్ కేవలం 15 ఏళ్ల వయసులోనే టీమిండియా క్యాప్ అందుకోబోతున్నాడు. అంతేకాదు, 1996లో పాకిస్థాన్‌కు చెందిన హసన్ రజా (14 ఏళ్లు) తర్వాత ఒక పూర్తి స్థాయి సభ్య దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించనున్నాడు.

ఐపీఎల్, ఇండియా-ఏ లో రికార్డుల వేట

బీహార్‌కు చెందిన ఈ ఓపెనర్ ప్రతిభను ఐపీఎల్ 2026 ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సీజన్‌లో వైభవ్ ఏకంగా 237.3 అద్భుత సగటుతో 776 పరుగులు చేసి అతి పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఆ తర్వాత ఇండియా-ఏ తరఫున ఆడిన త్రైపాక్షిక సిరీస్ ఫైనల్లో శ్రీలంక-ఏ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ హాఫ్ సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఇండియా-ఏ జట్టును విజేతగా నిలిపాడు. అయితే, లీగ్ మ్యాచ్‌లో లంక ఆటగాడితో గొడవపడి నెగెటివ్ వార్తల్లోనూ నిలిచాడు.

ప్రొటోకాల్స్ మార్చిన బీసీసీఐ

సాధారణంగా భారత సీనియర్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను అన్ని రోజులు అనుమతించరు. కానీ, వైభవ్ సూర్యవంశీ ఇంకా 16 ఏళ్లు కూడా నిండని చిన్న పిల్లాడు కావడంతో, బీసీసీఐ తన నిబంధనలను పక్కనబెట్టి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. ఈ అత్యంత కీలకమైన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్‌కు తోడుగా ఉండేందుకు అతని తల్లిదండ్రులు కూడా లండన్ ప్రయాణమవబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఖర్చులను బీసీసీఐ భరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ చారిత్రాత్మక అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us