రోహిత్ కెరీర్‌ను రక్షించిన బ్యాట్ ఎవరిదో తెలుసా? అతను అదృష్టానికి మారుపేరు..!
లార్డ్స్‌లో రోహిత్ శర్మ చేసిన చారిత్రాత్మక వన్డే సెంచరీ వెనుక ఆసక్తికరమైన కథ వెలుగులోకి వచ్చింది. తన బ్యాట్‌తో సంతృప్తి చెందక మరో ప్లేయర్ బ్యాట్‌ను ఉపయోగించిన రోహిత్ 138 పరుగులతో చెలరేగాడు. మరి ఆ బ్యాట్ ఎవరిది దాని వెనకున్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆదివారం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కంటే ముందు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు, లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్ అంటూ ఏ రేంజ్‌లో పుకార్లు హల్‌చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, తనపై వచ్చిన పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ.. తనకు ఫ్యాన్స్ పునకాలతో ఊగిపోయేలే హిట్‌మ్యాన్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టీమిండియా మ్యాచ్ ఓడిపోయినా.. భారత క్రికెట్ అభిమానులు బాధపడలేదు. రోహిత్ సెంచరీతో సంతోషంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ సెంచరీ రోహిత్ కెరీర్‌ను కాపాడిందనే చెప్పాలి. వన్డే వరల్డ్ కప్ 2027 ఆడాలనే తన సంకల్పం ఇంకా అలాగే ఉందంటే ఈ సెంచరీ ఒక కారణం. అయితే రోహిత్ ఈ అద్భుతమైన సెంచరీ తన బ్యాట్‌తో కొట్టలేదు. మరో ప్లేయర్ బ్యాట్‌ను అడిగి తీసుకొని, సెంచరీతో సాధించాడు. ఇంతకీ రోహిత్ ఆడిన బ్యాట్ ఎవరిది? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా తన బ్యాట్‌తోనే ఆడే రోహిత్, ఈ మ్యాచ్‌లో మాత్రం భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు చెందిన బ్యాట్‌ను ఉపయోగించి చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. ఈ విషయాన్ని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే శార్దూల్ స్వయంగా వెల్లడించాడు. నిన్న జరిగిన మ్యాచ్‌కు హిందీ కామేంటేటర్‌గా వ్యవహరించిన శార్థుల్.. మ్యాచ్ లైవ్‌లో కెమెరామెన్ రోహిత్ బ్యాట్‌ను జూమ్ చేయడంతో బ్యాట్ కింద శార్థుల్ ఠాకూర్ అని రాసి ఉంది. అది నా బ్యాటే.. నన్ను టీమిండియా నుంచి దూరం పెట్టలేరంటూ సరదాగా పేర్కొన్నాడు. అయితే ఆటగాళ్ల పేర్లు వారి వారి బ్యాట్ల కింద రాసి ఉంటుంది.
వీడియో చూడండి
View this post on Instagram
కాగా, రోహిత్ తన బ్యాట్‌తో సరైన టైమింగ్, బ్యాలెన్స్ లభించడం లేదని భావించడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న శార్దూల్ బ్యాట్‌ను తీసుకుని బరిలోకి దిగాడు. ఆ మార్పు అతనికి అద్భుతంగా కలిసి వచ్చింది. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ తొలి నుంచే ధాటిగా ఆడాడు. శార్దూల్ బ్యాట్‌తో అతను బంతిని ఎంతో నమ్మకంగా టైమ్ చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 147 పరుగులు, అనంతరం విరాట్ కోహ్లీతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు.
ఈ శతకంతో రోహిత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్‌లో వన్డే శతకం నమోదు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ మైదానంలో భారత ఆటగాడిగా అత్యధిక వ్యక్తిగత స్కోరు 93 పరుగులు మాత్రమే ఉండగా, అది సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది. రోహిత్ తన 138 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆ రికార్డును అధిగమించాడు. 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తర్వాత అతనికి ఇది తొలి అంతర్జాతీయ శతకం కావడం విశేషం. ఈ విషయంపై శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ.. తాను ఎస్‌ఎస్ బ్యాట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నానని, సంస్థ తనకు పంపిన బ్యాట్లలో రెండింటిని రోహిత్ అడగడంతో సంతోషంగా ఇచ్చానని తెలిపాడు.
రోహిత్‌కు బ్యాట్లు అంటే చాలా ఇష్టం. అతను భారత క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అలాంటి ఆటగాడికి బ్యాట్ ఇవ్వడం నా అదృష్టం. నా బ్యాట్‌తో లార్డ్స్‌లో అతను చారిత్రాత్మక శతకం సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని శార్దూల్ పేర్కొన్నాడు. కాగా శార్థుల్ ఠాకూర్‌కు మరో ముద్దు పేరు కూడా ఉంది.. అదే లార్డ్. అతన్ని టీమ్‌లో లార్డ్ శార్థుల్ ఠాకూర్ అని ఉంటారు. టీమ్‌కు వికెట్లు అవసరమైన సమయంలో శార్థుల్‌ను బౌలింగ్‌కు తీసుకొస్తే కచ్చితంగా వికెట్ అందిస్తాడని, అతనితో అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. రోహిత్ కూడా అలానే నమ్మి ఉంటాడేమో అందుకు ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌లో శార్థుల్ బ్యాట్‌తో బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
