AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: జిమ్‌కి వెళ్లాల్సిన పనే లేదు..! ఈ సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గడం చాలా ఈజీ

Weight Loss Tips: ఊబకాయం తగ్గించుకోవడానికి కఠినమైన డైట్లు, తీవ్రమైన వ్యాయామం, ఫాస్టింగ్ తప్పనిసరి కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కేవలం రెండు చిన్న అలవాట్లను మార్చుకుంటే మీ శరీరంలో మ్యాజిక్ జరుగుతుంది. ఇలా రోజుకు 600–800 కేలరీలు తగ్గించగలిగితే ఏడాదిలో గణనీయంగా బరువు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

Weight Loss: జిమ్‌కి వెళ్లాల్సిన పనే లేదు..! ఈ సింపుల్ ట్రిక్‌తో బరువు తగ్గడం చాలా ఈజీ
Weught Loss Tips
Janardhan Veluru
|

Updated on: Jul 20, 2026 | 4:36 PM

Share

ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. బరువు తగ్గేందుకు చాలామంది కఠినమైన డైట్లు, గంటల కొద్దీ వ్యాయామం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి పద్ధతులను అనుసరిస్తుంటారు. అయితే కఠినమైన డైట్లు, వ్యాయామం అవసరం లేకుండానే ఏడాదిలో 20 కిలోల మేరకు బరువు తగ్గడం సాధ్యమేనంటే మీరు నమ్మగలరా..? రోజువారీ ఆహారంలో కేవలం రెండు చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా గణనీయంగా బరువు తగ్గే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు సుమారు 600–800 కేలరీలు తగ్గించగలిగితే, ఏడాదిలో పెద్ద మార్పు కనిపించే అవకాశం ఉంటుంది.

1. ఆకలి లేకపోయినా తినే అలవాటు మానేయండి

చాలామంది నిజంగానే ఆకలి లేకపోయినా.. బోర్‌గా అనిపించినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ప్రయాణాల్లో లేదా పని మధ్యలో బిస్కెట్లు, చిప్స్, స్వీట్లు, ప్యాకెట్ స్నాక్స్ తింటుంటారు. దీనివల్ల అవసరం లేని కేలరీలు శరీరంలో చేరతాయి. బరువు తగ్గాలంటే ఈ అలవాటును మానుకోవాలి. నిజంగా ఆకలి వేసినప్పుడు మాత్రమే స్నాక్స్ తినాలి. ఆకలి లేకపోతే స్నాక్స్‌కు బదులుగా నీరు, చక్కెర లేని బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. అలాగే నిజంగానే ఆకలి లేకపోయినా భావోద్వేగాల కారణంగా తినే అలవాటును గుర్తించి తగ్గించండి.

2. వయస్సుకు తగ్గట్టుగా ఆహార పరిమాణాన్ని తగ్గించండి

వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో మెటాబాలిజం నెమ్మదిస్తుంది. దీంతో కేలరీల అవసరం కూడా తగ్గుతుంది. కానీ చాలామంది చిన్న వయసులో తిన్నంతే పరిమాణంలో ఆహారం తీసుకుంటూ ఉంటారు. 30 ఏళ్లు దాటిన తర్వాత ఒక పూటకు సుమారు రెండు చపాతీలకే పరిమితం కావడం మంచిది. 40–50 ఏళ్ల వయస్సులో అవసరాన్ని బట్టి మరింత ఆహార నియంత్రణ పాటించాలి. రోజూ ఒక చపాతీ లేదా కొద్దిగా అన్నం తగ్గించడం, భోజనం తర్వాత స్వీట్లు మానేయడం వల్ల వందల కేలరీలు తగ్గించుకునేందుకు వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

ఏడాదిలో 20 కేజీల బరువు తగ్గడం ఎలా సాధ్యం?

ఆకలి లేకుండా తినే స్నాక్స్ మానేస్తే రోజుకు సుమారు 300 కేలరీలు తగ్గించవచ్చు. చపాతీలు, అన్నం, స్వీట్లు పరిమితం చేస్తే మరో 300 కేలరీలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల రోజుకు దాదాపు 600 కేలరీల లోటు శరీరంలో ఏర్పడుతుంది. ఈ విధంగా దీర్ఘకాలంపాటు క్రమం తప్పకుండా పాటిస్తే బరువు క్రమంగా తగ్గుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గడం అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్ర, ఒత్తిడి నియంత్రణ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నిజమైన ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినడం, అవసరానికి మించి కేలరీలు తీసుకోకుండా ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా బరువును నియంత్రించవచ్చు.

(గమనిక: రోజుకు 600–800 కేలరీల లోటు అందరికీ సురక్షితం కాకపోవచ్చు. వయస్సు, లింగం, బరువు, ఆరోగ్య పరిస్థితులు, శారీరక శ్రమను బట్టి అవసరమైన కేలరీలు మారుతాయి. అలాగే 20 కేజీల బరువు తగ్గడం ప్రతి ఒక్కరికీ సాధ్యంకాకపోవచ్చు. బరువు తగ్గేందుకు డైట్ ప్లాన్ మొదలుపెట్టే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది)

Follow Us