AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో.. రెండు ప్రపంచకప్‌లలోనూ.. ఒకే ఒక్కడు ‘మ్యాచ్ విన్నర్’

యస్.. ఇంగ్లండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్‌ ప్రత్యర్థులకు దిమ్మతిరిగే స్ట్రోక్స్‌ ఇస్తున్నాడు. మ్యాచ్ ఏదైనా.. టోర్నీ ఎక్కడైనా..

Ben Stokes: అప్పుడు విలన్.. ఇప్పుడు హీరో.. రెండు ప్రపంచకప్‌లలోనూ.. ఒకే ఒక్కడు 'మ్యాచ్ విన్నర్'
Ben Stokes
Ravi Kiran
|

Updated on: Nov 14, 2022 | 1:05 PM

Share

యస్.. ఇంగ్లండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్‌ ప్రత్యర్థులకు దిమ్మతిరిగే స్ట్రోక్స్‌ ఇస్తున్నాడు. మ్యాచ్ ఏదైనా.. టోర్నీ ఎక్కడైనా.. దుమ్మురేపుతూ ఇరగదీస్తున్నాడు. ఇంగ్లండ్‌ టీమ్‌ను ఒంటిచేత్తో విశ్వవిజేతగా నిలుపుతూ బిగ్ మ్యాచ్‌ విన్నర్‌గా మారిపోయాడు. మెరుపు బౌలింగ్‌.. సొగసైన బ్యాటింగ్‌.. చురుకైన ఫీల్డింగ్‌.. ఆల్‌ రౌండ్‌ షోతో క్రికెట్‌ ఫ్యాన్స్‌కి హీరో అయ్యాడు. ఇంగ్లండ్‌ను మరోసారి విశ్వవిజేతగా నిలబెట్టిన.. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అసలైన హీరో బెన్ స్టోక్స్ అని అంతకుమించి బిగ్ మ్యాచ్ విన్నర్ అనే ట్యాగ్ లైన్‌ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు. 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్ అభిమానులకు విలన్‌గా మారిన స్టోక్స్‌.. అసాధారణ పెర్ఫామెన్స్‌తో 2019 వన్డే ప్రపంచకప్‌.. లేటెస్ట్‌గా టీ 20 వరల్డ్‌ కప్‌ను అందించాడు. ఎక్కడ పొగొట్టుకున్నాడో… అక్కడే రాబట్టి హీరోగా మారిపోయాడు.

టీ20 ప్రపంచకప్ 2022లోనూ ఒంటరి పోరాటం చేసి మరోసారి ఇంగ్లీష్‌ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.. కష్టాలకు కుంగిపోకుండా ప్రయత్నం చేస్తే సక్సెస్‌ అవుతామని బెన్‌ స్టోక్స్‌ని చూస్తే అర్థమవుతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. స్టోక్స్ హీరోగా నిలబడ్డ తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ తలపడింది. ఆ మ్యాచ్‌లో విండీస్ విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాలి. అప్పటి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. బెన్ స్టోక్స్‌కు బంతినందించాడు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ కార్లోస్ బ్రాత్ వైట్ వరుసగా ఓ ఫోర్‌, 4 సిక్స్‌లు బాది విజయాన్ని లాగేసుకున్నాడు. బ్రాత్‌వైట్ సంచలన బ్యాటింగ్‌తో నివ్వెరపోయిన స్టోక్స్ తల పట్టుకున్నాడు. 19 పరుగులు డిఫెండ్ చేయకపోవడాన్ని తప్పుబడుతూ స్టోక్స్‌పై విమర్శల వర్షం కురిసింది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇంగ్లండ్ జట్టు మాత్రం స్టోక్స్‌ అండగా నిలిచింది. ఆ పరాజయంతో మరింత రాటుదేలిన స్టోక్స్.. 2019 వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శనతో జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ అందించాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ స్టోక్స్ 84 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అసాధారణ బ్యాటింగ్‌తో విజయాన్నందించాడు. టెస్ట్ ఫార్మాట్‌లోనూ ఒంటరి పోరాటంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్‌ కోల్పోకుండా చేశాడు. మానసిక సమస్యలతో చాలా రోజులుగా ఆటకు దూరంగా ఉన్న స్టోక్స్.. సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ బరిలోకి దిగాడు. పరిమిత ఓవర్లపైనే మరింత ఫోకస్ పెట్టిన స్టోక్స్‌ ఇంగ్లండ్‌కు కావాల్సిన విజయాన్నందించాడు. దాంతో బెన్ స్టోక్స్ లెక్క సరిచేశాడని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్.. రెండో టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 137 పరుగులకే ఇంగ్లండ్‌ కట్టడి చేసింది. ఓ వికెట్ పడగొట్టిన స్టోక్స్‌.. బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీతో మ్యాచ్‌లో కీ రోల్ పోషించాడు. ఫైనల్‌గా తన టీమ్‌కు కప్‌ నందించాడు. ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచమంతా బెన్‌ స్టోక్స్‌ జపమే చేస్తోంది.