Test Twenty: క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ‘టెస్ట్ ట్వంటీ’.. 4వ ఫార్మాట్ రూల్స్ ఇవే.. ఒకే టీంలో స్త్రీ,పురుషులు..!
Test Twenty Rules: క్రికెట్ ప్రపంచంలో సరికొత్త శకం మొదలైంది. సంప్రదాయ టెస్ట్ మ్యాచ్‌లోని వ్యూహాలను, టీ20లోని వేగాన్ని కలగలుపుతూ ‘టెస్ట్ ట్వంటీ’ అనే నాలుగో ఫార్మాట్‌ను రూపొందించారు. చరిత్రలో తొలిసారిగా మహిళలు, పురుషులు టీంలతో, ఒకే లక్ష్యం కోసం కలిసి ఆడేలా ఈ సరికొత్త ఫార్మాట్‌ను నిర్మించడం విశేషం.

Test Twenty Rules: టెస్ట్ క్రికెట్ గాంభీర్యాన్ని, టీ20 ఉత్సాహాన్ని ఒకే చోట చేర్చడమే ఈ ఫార్మాట్ ప్రధాన ఉద్దేశం. ఇందులో ఒక్కో జట్టు రెండు ఇన్నింగ్స్‌ల చొప్పున ఆడుతుంది. అంటే ఒక మ్యాచ్‌లో మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌లు (జట్టుకు రెండు) ఉంటాయి. ఒక్కో ఇన్నింగ్స్ 20 ఓవర్ల పాటు సాగుతుంది. తద్వారా ఒకే రోజులో 80 ఓవర్ల ఆట పూర్తవుతుంది. టెస్ట్ మ్యాచ్ తరహాలోనే ఇన్నింగ్స్ స్కోర్లను తదుపరి ఇన్నింగ్స్‌కు జోడిస్తారు. ఇందులో గెలుపు, ఓటమి, టై మాత్రమే కాకుండా ‘డ్రా’ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగియాలంటే, చివరి ఇన్నింగ్స్ ఆడుతున్న జట్టు ఆట ముగిసే సమయానికి కనీసం ఐదు వికెట్లను కాపాడుకోవాల్సి ఉంటుంది.
సమానత్వమే పునాది: మహిళలు, పురుషుల మేళవింపు..
టెస్ట్ ట్వంటీ కేవలం ఆట తీరులోనే కాదు, సామాజిక మార్పులోనూ అగ్రగామిగా నిలవనుంది. మే 14, 2026న ప్రకటించిన ‘పారిటీ రూల్’ (సమానత్వ నియమం) ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీలో పురుషుల జట్టు, మహిళల జట్టు సమానంగా ఉంటాయి. వీరు వేర్వేరుగా కాకుండా, ఒకే పాయింట్ల పట్టిక, ఒకే లోగో, ఒకే ట్రోఫీ కోసం పోరాడుతారు. మైదానంలో ఇరు విభాగాల భాగస్వామ్యం లేకుండా ఏ జట్టూ విజేతగా నిలవలేదు. ఇది క్రీడా ప్రపంచంలోనే ఒక గొప్ప మలుపుగా పరిగణించబడుతోంది. 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు గల యువ క్రీడాకారుల కోసం ఈ వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
ఆట నియమాలు, వ్యూహాలు..
ఈ ఫార్మాట్‌లో కెప్టెన్లకు సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. ప్రతి జట్టుకు మ్యాచ్ మొత్తంలో కేవలం ఒకే ఒక ‘పవర్ ప్లే’ లభిస్తుంది. దీనిని మొదటి ఇన్నింగ్స్‌లో లేదా రెండో ఇన్నింగ్స్‌లో ఎప్పుడు ఉపయోగించుకోవాలనేది కెప్టెన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. పవర్ ప్లే సమయంలో 30 గజాల వలయం వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ టై అయితే, ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు.
దిగ్గజాల మద్దతు, వేలం ప్రక్రియ..
ఈ వినూత్న ఫార్మాట్‌కు ఏబీ డివిలియర్స్, హర్భజన్ సింగ్, మాథ్యూ హేడెన్, సర్ క్లైవ్ లాయిడ్ వంటి దిగ్గజ క్రికెటర్లు మద్దతు ప్రకటించారు. వీరంతా ఈ లీగ్ సలహా మండలిలో సభ్యులుగా ఉన్నారు. మొదటి సీజన్‌లో దుబాయ్, లండన్, అమెరికా, భారత్ నుంచి మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత ద్వారా క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించి, సుమారు 1000 మందితో ఒక జాబితాను రూపొందిస్తారు. అందులో నుంచి 300 మంది ఆటగాళ్లు వేలం ప్రక్రియకు అర్హత సాధిస్తారు. ప్రతి జట్టులో ఎనిమిది మంది భారతీయులు, ఎనిమిది మంది విదేశీయులతో కలిపి మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
