Temba Bavuma: మరుగుజ్జు అంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. 25 ఏళ్లలో ఒకే ఒక్కడిగా సరికొత్త చరిత్ర..
Temba Bavuma Captaincy Record: టెంబా బావుమా కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా మరో అద్భుతమైన ఘనతను సాధించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత, బావుమా స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను ఓడించింది. విశేషమేమిటంటే, అతని కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ సాధించింది.

Temba Bavuma Captaincy Record: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అరుదైన ఘనత సాధించాడు. గత 25 ఏళ్లుగా ఏ దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు సాధ్యం కాని రీతిలో, భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాడు. బావుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు భారత్‌ను క్లీన్ స్వీప్ చేసి ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
రికార్డు విజయం..
టెంబా బావుమా సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) గెలిచిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు, ఇప్పుడు భారత్‌ను సొంతగడ్డపైనే ఓడించింది. కోల్‌కతా, గౌహతి వేదికలుగా జరిగిన టెస్టుల్లో విజయాలు సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా బావుమా రికార్డులకెక్కాడు.
అజేయ నాయకుడిగా..
టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్‌గా బావుమా రికార్డు అమోఘంగా ఉంది. ఇప్పటివరకు అతను సారథ్యం వహించిన 12 టెస్టుల్లో దక్షిణాఫ్రికా 11 విజయాలు సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (ఒక డ్రా) బావుమా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. బావుమా ఎత్తు తక్కువైనా, అతని ఆటతీరు, నాయకత్వ పటిమ ఆకాశమంత ఎత్తులో ఉన్నాయని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. కోల్‌కతా టెస్టులో జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడు.
వ్యూహాత్మక సన్నద్ధత..
భారత్‌లో సిరీస్ గెలవడానికి బావుమా పక్కా ప్రణాళికతో వ్యవహరించాడు. ఇందుకోసం అతను పాకిస్థాన్ పర్యటనకు వెళ్లకుండా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తరపున భారత్‌లో పర్యటించాడు. ఇక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. ఈ హోంవర్క్ ఫలితంగానే కోల్‌కతా, గౌహతి టెస్టుల్లో దక్షిణాఫ్రికా అలవోకగా విజయాలు సాధించగలిగింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




