Gautam Gambhir: మేకపోతు గంభీర్.. పులిలాంటి టీమిండియా కాస్తా పిల్లిలా ఎందుకు మారింది ?
ఎలా ఓడారో అర్థం కాలేదు. కానీ ఎందుకు ఓడారో అభిమానలోకం ఇప్పుడిప్పుడే విశ్లేషిస్తోంది. ఒకప్పుడు హోమ్‌గ్రౌండ్‌లో టీమిండియా పులి. కానీ ఇప్పుడు పిల్లిలా మారిందన్న అతిపెద్ద అపవాదు మూటగట్టుకుంది. దీనికంతటికి కారణం కోచ్ అంటోంది అభిమానప్రపంచం. ఇంతకూ సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్..ఎవరికి బ్రెయిన్ వాష్ చేయాలి..? గౌహతీలో ఓటమికి గౌతం గంభీరే కారణమా..?

గౌహతి ఓటమి తర్వాత భారత క్రికెట్‌లో దుమారం మామూలుగా లేదు. కోల్‌కతా ఓటమి ఎల్లో అలర్ట్ అయితే గౌహతిలో ఓటమి రెడ్ అలర్ట్. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా భారత బ్యాటింగ్ పేకమేడలా కూలింది. జడేజా మినహా ఒక్కరు కూడా క్రీజులో దమ్ముచూపలేక సౌతాఫ్రికా బౌలింగ్ దుమ్ములో కొట్టుకుపోయారు..సిరీస్ ఆరంభం నుంచే గంభీర్ వ్యూహాలు గందరగోళం సృష్టించాయంటున్నారు మాజీలు.
టెస్టు సిరీస్ అంటే బుద్ధి, బలం, ఓపికగా క్రీజులోపాతుకుపోయే నేర్పు ఉండాలి. కానీ భారత జట్టు ప్రదర్శించిన తీరును చూస్తే వీటిలో ఏదీ నిలబడలేదు. వ్యూహాలు రాయి మీద నీళ్లు పోసినట్టే వృధా అయ్యాయి. గంభీర్ బాధ్యతలు తీసుకున్న రోజునుంచి అభిమానుల్లో ఓ ఆశ, ఓ ఊపిరి, ఓ దమ్ము కనిపించింది. కానీ ఆస్థాయిలో జట్టును గంభీర్ నడపించలేకపోయాడు. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుతో పోరాడుతూ కొత్త ఎక్స్‌పెరిమెంట్లు చేయడం ఆటగాళ్లను గందరగోళంలోకి నెట్టింది. బ్యాటింగ్ క్రమంలో సడెన్ మార్పులు జట్టుకు ప్రమాదకర స్థితిలోకి నెట్టింది.
గత రెండు దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. ఎక్కువమంది కోచ్‌లు టీమ్ఇండియాకు మంచి ఫలితాలే అందించారు. గ్రెగ్ చాపెల్ మినహా, గ్యారీ కిర్‌స్టన్ , రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ ఇలా ప్రతి కోచ్ మంచి ఫలితాలను రాబట్టారు. కొంతమంది కోచ్‌లకు కెప్టెన్లతో పొసగకపోయినా, జట్టు ప్రదర్శన మాత్రం దెబ్బ తినలేదు. కానీ గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టోటల్ పిక్చరే మారిపోయిందంటున్నారు మాజీ ఆటగాళ్లు.కానీ గంభీర్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉన్నాడు
ఇప్పుడు గంభీర్‌ను సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. మాజీ ఆటగాళ్లతో పాటు సోషల్ మీడియాలో కోచ్ రాజీనామా చేయాలంటూ #SackGautamGambhir లాంటి హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ల రిటైర్‌మెంట్ వెనుక గంభీర్ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ పరాభవానికి ఎవరిని బాధ్యులను చేస్తారు.. ఎవరిపై వేటు పడుతుంది అనే చర్చ జరుగుతోంది. గంభీర్ కోచ్ అయ్యాకే ఈ రెండు పరాభవాలూ ఎదురయ్యాయి. మరి బీసీసీఐ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
