Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా..! ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో అపూర్వ విజయం

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో గెలిచింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసి అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌, రెండవ ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌ దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌తో 6 వికెట్లు తీశారు.

IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా..! ఇంగ్లాండ్‌పై రెండో టెస్టులో అపూర్వ విజయం
Team India
SN Pasha
|

Updated on: Jul 06, 2025 | 10:07 PM

Share

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్‌ గెలిచింది గిల్‌ సేన. లీడ్స్‌ లో జరిగిన తొలి టెస్టులో ఓటమికి ఈ విజయంతో బదులుతీర్చుకుంది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. అలాగే టీమిండియా బౌలర్లలో తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 6, రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌ దీప్‌ 6 వికెట్లతో సత్తా చాటారు. 600లకు పైగా పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కేవలం 271 పరుగులకే ఆలౌట్‌ చేశారు.

జూలై 2న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ తీసుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ ఏకంగా 587 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ గిల్‌ 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులతో 269 పరుగులు సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 87, రవీంద్ర జడేజా 89, వాషింగ్టన్‌ సుందర్‌ 42 పరుగులతో టీమిండియాకు పెద్ద స్కోర్‌ అందించడంతో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో గట్టి జవాబే ఇచ్చింది. కేవలం 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా హ్యారీ బ్రూక్‌(158), జేమీ స్మిత్‌ (184) పోరాటంతో 407 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. టీమిండియా బౌలర్లలో సిరాజ్‌ బుమ్రా లేని లేటు పూడుస్తూ 6 వికెట్లతో చెలరేగిపోయాడు. అలాగే ఆకాశ్‌ దీప్‌ సైతం 4 వికెట్లు పడగొట్టాడు.

ఇక మంచి లీడ్‌తో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా ఈసారి కూడా భారీ స్కోర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో కదం తొక్కిన గిల్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. 162 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సులతో 161 పరుగులు చేసి మళ్లీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 55, రిషభ్‌ పంత్‌ 65, జడేజా 69 పరుగులతో రాణించారు. మొత్తంగా ఇంగ్లాండ్‌కు టీమిండియా 600 ప్లస్‌ టార్గెట్‌ ఇచ్చింది. ఇక భారీ టార్గెట్‌తో మరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆకాశ్‌ దీప్‌ చుక్కలు చూపించాడు. ఏ దశలోనూ ఇంగ్లాండ్‌ లక్ష్యం దిశగా సాగలేదు. ఈ సారి కూడా జేమీ స్మిత్‌ 88 పరుగులతో పోరాటం చేసినా.. టీమిండియా బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. ఇంగ్లాండ్‌కు ఓటమిని తప్పించలేకపోయాడు. స్మిత్‌ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు.

ఆకాశ్‌ దీప్‌ అద్భుతమైన బౌలింగ్‌ ముందు వాళ్లు తలొంచారు. మొత్తంగా 68.1 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 271 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఈ విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో ఆకాశ్‌ దీప్‌ 6 వికెట్లు, సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, జడేజా, సుందర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఈ విజయంతో కొత్త కెప్టెన్‌కు తొలి విజయం దక్కింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి