Virat Kohli: ప్రత్యర్థి జట్టులపై ‘రన్ మిషన్’ రికార్డు.. సచిన్, డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానం కోహ్లీదే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో మెరిశాడు. ఫలితంగా సెంచరీ కోసం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మ్యాన్ విరాట్ కోహ్లీ తన సూపర్ సెంచరీతో క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్ మన్ వంటి దిగ్గజాల తర్వాతి స్థానం తన సొంతం చేసుకున్నాడు కోహ్లీ. అసలు ఆ వివరాలేమిటంటే.. దాదాపు మూడేళ్ల పాటు సాగిన టీమిండిమా అభిమానుల నిరీక్షణకు టీమిండియా కింగ్ కోహ్లీ ముగింపు పలికాడు. ఎప్పుడో 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్‌పై టెస్టు సెంచరీ బాదిన కోహ్లీ.. మళ్లీ ఈ రోజు (2023 మార్చి 12) మళ్లీ ఆ ఫీట్‌ను అందుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ(365 బంతుల్లో 186 పరుగులు; 15 ఫోర్లు)తో మెరిశాడు. ఫలితంగా సెంచరీ కోసం సాగిన 1205 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు కోహ్లీ ఫుల్‌స్టాప్ పెట్టాడు. అయితే విరాట్ కోహ్లీకి ఇది 28వ టెస్టు సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా కింగ్ కోహ్లీ కెరీర్‌లో ఇది 75వ సెంచరీ. టెస్టుల్లో 28.. వన్డేల్లో 46.. టి20ల్లో 1 సెంచరీని విరాట్ బాదాడు. ఇక ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు.
అదేమిటంటే.. ఆస్ట్రేలియాపై మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీకి ఇది 16వ సెంచరీ. ఇందులో 8 సెంచరీలు టెస్టుల్లోనే చేశాడు. ఈ క్రమంలో ఒకే ప్రత్యర్థిపై ఎక్కువ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్‌గా కోహ్లీ అవతరించాడు. తద్వారా క్రికెట్‌లో ఎవర్ గ్రీన్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, సర్ డాన్ బ్రాడ్ మన్ సరసన విరాట్ కోహ్లీ చేరాడు. ఇంకా వారిద్దరే కోహ్లీ కంటే ముందున్నారు. సచిన్ టెండూల్కర్ తన ఇంటర్నేషన్ క్రికెట్ కెరీర్‌లో ఆస్ట్రేలియాపై 20 సెంచరీలు.. శ్రీలంకపై 17 సెంచరీలు చేశాడు. అలాగే సర్ డాన్ బ్రాడ్ మన్ ఇంగ్లండ్‌పై 19 సెంచరీలు బాదాడు. వీరిద్దరి తర్వాత విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 16 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై కూడా కోహ్లీ 16 సెంచరీలు చేశాడు.
కాగా, గత కొంతకాలంగా టెస్టు ఫార్మాట్‌లో కోహ్లీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయాడు. దాంతో కోహ్లీపై తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. కోహ్లీ టెస్టులకు పనికిరాడంటూ.. సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీ పని అయిపోయిందంటూ విమర్శకుల నుంచి కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే వీటన్నింటికీ కోహ్లీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. మరోవైపు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 571-10 వద్ద ముగించింది. దీంతో అంతకముందు 480-10 పరుగులు చేసిన ఆసీస్ జట్టుపై టీమిండియా 91 పరుగుల అధిక్యంలో ఉన్నట్లయింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ కోసం క్రీజులోకి వచ్చిన ఆసీస్ బ్యాటర్లు 6 ఓవర్లలో 3 పరుగులు చేసి నాలుగో రోజు ఆట ముగించారు. ప్రస్తుతం క్రీజులో ట్రావీస్ హెడ్(18 బంతుల్లో 3 పరుగులు), మాథ్యూ కున్హెమాన్(18 బంతుల్లో 0 పరుగులు) ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..