Team India: స్లో బ్యాటర్, ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్.. 113 నిమిషాల్లోనే 200.. వరుసగా 6 సిక్సులతో విధ్వంసం.. 33 ఏళ్లపాటు చెక్కుచెదరని రికార్డ్..
37 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే జనవరి 10న ఓ భారత బ్యాట్స్‌మెన్ తన తుఫాను బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు 33 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉండిపోయింది.
క్రికెట్‌లో రికార్డులు పుడుతూనే ఉంటాయి. వాటిని కొంతమంది ఆటగాళ్లు బద్దలు కొట్టేస్తూనే ఉంటారు. అయితే కొన్ని కొన్ని రికార్డులు త్వరగానే బ్రేక్ అయినా.. కొన్ని మాత్రం బ్రేక్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. తాజాగా అలాంటి ఓ రికార్డు గురించే మనం మాట్లాడుతున్నాం. 1985 సంవత్సరంలో చేసిన ఈ రికార్డు బ్రేక్ అవ్వడానికి చాలా సమయం పట్టింది. ఈ రికార్డును భారత మాజీ ఆల్‌రౌండర్, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సృష్టించాడు. శాస్త్రి తన ఫాస్ట్ బ్యాటింగ్‌కు పెద్దగా పేరు తెచ్చుకోలేదు. కానీ, 37 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే జనవరి 10న తన తుఫాను బ్యాటింగ్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతను చేసిన ఈ రికార్డు 33 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంది.
ఇంతకీ రవిశాస్త్రి రికార్డు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తు్న్నాం.. వేగవంతమైన ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. 1985 సంవత్సరంలో, బొంబాయి (ముంబై) తరపున ఆడుతున్నప్పుడు, శాస్త్రి బరోడాపై 1 గంట 53 నిమిషాల్లో అంటే మొత్తం 113 నిమిషాల్లో 200 పరుగులు చేశాడు. ఆ సమయంలో, ఇది అతి తక్కువ సమయంలో సాధించిన ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. ఇది 33 సంవత్సరాల తర్వాత 2018 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన షఫీకుల్లా 103 నిమిషాల్లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా బ్రేక్ చేశాడు.
200 పరుగులు.. వరుసగా 6 సిక్సర్లు..
రంజీ ట్రోఫీ వెస్ట్ జోన్ మ్యాచ్‌లో బాంబే, బరోడా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బాంబే కెప్టెన్ సునీల్ గవాస్కర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బాంబే తన తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 371 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో బరోడా 8 వికెట్లకు 330 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
రెండో ఇన్నింగ్స్‌లో బాంబే బ్యాట్స్‌మెన్ వేగంగా బ్యాటింగ్ చేశారు. లాల్‌చంద్ రాజ్‌పుత్ 136 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆరో నంబర్‌లో దిగి రవిశ్రాస్త్రి సందడి చేశాడు. శాస్త్రి 123 బంతుల్లో 13 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. ఈ 13 సిక్సర్లలో శాస్త్రి వరుసగా 6 సిక్సర్లు బాదాడు. బరోడా బౌలర్ తిలక్ రాజ్‌పై అతడు ఈ ఘనత సాధించాడు. ఆ సమయంలో వెస్టిండీస్‌కు చెందిన గ్యారీ సోబర్స్ తర్వాత వరుసగా 6 సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్ శాస్త్రి. సోబర్స్ 1968లో ఈ ఘనత సాధించాడు.
200 పరుగుల తుఫాను ముందు 7 గంటల్లో సెంచరీ..
శాస్త్రి సాధారణంగా తన స్లో బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. 200 పరుగుల తుఫాను ఇన్నింగ్స్‌కు వారం ముందు అతను సెంచరీ చేయడానికి 7 గంటల సమయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌పై ఈ సెంచరీ సాధించాడు. 357 బంతుల్లో 111 పరుగులు చేశాడు.
బాంబే vs బరోడా మ్యాచ్ డ్రా..
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. శాస్త్రి డబుల్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఐదు వికెట్లకు 457 పరుగులతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. బరోడాకు 499 పరుగుల టార్గెట్ ఉంది. బరోడా రెండో ఇన్నింగ్స్ చెల్లాచెదురైనప్పటికీ ఓటమి నుంచి తప్పించుకోవడంతో మ్యాచ్ డ్రా అయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..