T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ విండీస్ టీమ్ రెడీ.. అందరి చూపు ఆ పాతికేళ్ల కుర్రాడి పైనే
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమరానికి తెరలేవడమే తరువాయి. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ తన 15 మంది సభ్యుల పవర్‌ఫుల్ జట్టును ప్రకటించింది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ సారథ్యంలో కరీబియన్ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు సిద్ధమైంది.

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ సమరానికి తెరలేవడమే తరువాయి. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ తన 15 మంది సభ్యుల పవర్‌ఫుల్ జట్టును ప్రకటించింది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ సారథ్యంలో కరీబియన్ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు సిద్ధమైంది. అయితే జట్టు ఎంపికలో విండీస్ సెలక్టర్లు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించిన ఈ 15 మంది సభ్యుల జట్టులో అనుభవం, యువతరం మేళవించినట్లు కనిపిస్తోంది. షాయ్ హోప్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, సీనియర్ ఆటగాళ్లు రోవ్‌మన్ పావెల్, జేసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్ వంటి వారు జట్టులోకి తిరిగి వచ్చారు. అయితే డాషింగ్ ఓపెనర్ ఎవిన్ లూయిస్‌పై వేటు పడింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమవ్వడం లూయిస్ అవకాశాలను దెబ్బతీసింది. అలాగే స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం విండీస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
ఈ జట్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు 25 ఏళ్ల క్వింటన్ సాంప్సన్. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిన సాంప్సన్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. సీపీఎల్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 241 పరుగులు చేసిన ఇతను, ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ఆటగాడు. గాయాల నుంచి కోలుకున్న పేస్ సెన్సేషన్ షమర్ జోసెఫ్ తిరిగి జట్టులోకి రావడం బౌలింగ్ విభాగానికి బలాన్ని ఇచ్చింది.
ఈ టోర్నీలో వెస్టిండీస్ గ్రూప్-సి లో ఉంది. వీరితో పాటు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 7న కోల్‌కతాలోని ఐకానిక్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్‌తో విండీస్ తన వేటను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11న ఇంగ్లాండ్‌తో, 15న నేపాల్‌తో, 19న ఇటలీతో తలపడనుంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జనవరి 27 నుంచి 31 వరకు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో కూడా ఇదే జట్టు పాల్గొననుంది.
వెస్టిండీస్ తుది జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జేసన్ హోల్డర్, అకీల్ హుస్సేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోతీ, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, క్వింటన్ సాంప్సన్, జైడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.
