క్రికెట్లో ఎప్పుడు ఏ టీం ఓడిపోతుందో.. ఏ టీం గెలుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కోసారి ఊహించని ట్విస్టులు జరుగుతుంటాయి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో అప్పటిదాకా గెలుస్తుందనుకున్న టీం.. ఓడిపోయిన సందర్భాలు లేకపోలేదు. అలాంటి సీన్ ఒకటి ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయి.. టీ20ల్లో చెత్త రికార్డు నమోదు చేసిన ఓ టీం.. ఇప్పుడు ఫైనల్స్ పోరుకు సిద్దం అయింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి.. మిగిలిన మూడు జట్లతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల బిగ్ బాష్ లీగ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఫైనల్స్‌కు నాలుగు జట్లు ఖరారయ్యాయి. పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ లిస్టులో ఉన్నాయి. అటు అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్, బ్రిస్బేన్ హీట్ లీగ్‌కు ఔట్ అయ్యారు.
సిడ్నీ థండర్స్ జట్టు బుధవారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ జట్టు 119 పరుగులు చేసింది. 120 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ కేవలం 18.5 ఓవర్లలోనే సులువుగా చేధించింది. దీంతో 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో ఈ జట్టు 14 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచి.. ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.
డిసెంబర్ 16న, సిడ్నీ స్ట్రైకర్స్ జట్టు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో అమీతుమీ తేల్చుకుంది. ఇందులో కేవలం 15 పరుగులకే సిడ్నీ థండర్స్ ఆలౌట్ అయింది. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ జట్టు 140 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా, సిడ్నీ జట్టు 35 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సిడ్నీ థండర్స్ జట్టులో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రెండంకెల స్కోరును అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే.
.@ThunderBBL win it with seven balls to spare and get through to the finals! #BBL12 pic.twitter.com/m8qw36ZCkk
— 7Cricket (@7Cricket) January 25, 2023