AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : చరిత్రలో ఒకేఒక్కడు.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్.. ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ స్పిన్నర్

IPL 2026 : ఆర్‌సీబీ స్పిన్నర్ సుయాష్ శర్మ ఢిల్లీపై చారిత్రాత్మక బౌలింగ్‌తో రికార్డు సృష్టించాడు. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్ వేసి ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక స్పిన్నర్ ఒకే మ్యాచ్‌లో ఇన్ని డాట్ బాల్స్ వేయడం ఇదే తొలిసారి.

IPL 2026 : చరిత్రలో ఒకేఒక్కడు.. 24 బంతుల్లో 20 డాట్ బాల్స్.. ఢిల్లీ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఆర్‌సీబీ స్పిన్నర్
Suyash Sharma
Rakesh
|

Updated on: Apr 28, 2026 | 11:06 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కేవలం ఒక జట్టు గెలుపునే కాదు.. రికార్డులను తిరగ రాస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల మైండ్ బ్లాక్ చేశాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో ఏ స్పిన్నర్‌కూ సాధ్యం కాని రీతిలో బౌలింగ్ చేసి, పరుగుల వరద పారే టీ20 ఫార్మాట్‌లో పరుగుల కోసం బ్యాటర్లు కటకటలాడేలా చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఆర్‌సీబీ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్‌వుడ్ చెలరేగిపోగా, యువ స్పిన్నర్ సుయాష్ శర్మ మాత్రం తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ తీశాడు. ఈ 7 పరుగులలో 3 పరుగులు వైడ్ల ద్వారా వచ్చినవే కావడం విశేషం. అంటే బ్యాటర్లు బ్యాట్‌తో కొట్టి తీసిన పరుగులు కేవలం 4 మాత్రమే. అతని ఎకానమీ రేట్ 1.75గా నమోదైంది, ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత పొదుపుగా వేసిన స్పెల్.

ఈ మ్యాచ్‌లో సుయాష్ శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాను వేసిన 24 బంతుల్లో ఏకంగా 20 బంతులను డాట్ బాల్స్‌గా వేయడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో ఒక స్పిన్నర్ ఒకే మ్యాచ్‌లో ఇన్ని డాట్ బాల్స్ వేయడం ఇదే తొలిసారి. గతంలో 2019లో పేసర్ దీపక్ చాహర్ కేకేఆర్‌పై 20 డాట్ బాల్స్ వేసిన రికార్డు ఉండగా, ఇప్పుడు సుయాష్ ఆ రికార్డును సమం చేశాడు. స్పిన్నర్ల జాబితాలో మాత్రం సుయాష్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు.

2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తరపున ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించిన సుయాష్ శర్మ, తన తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీపై 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండేళ్ల పాటు కేకేఆర్ తరపున ఆడిన తర్వాత, 2025లో ఆర్‌సీబీ ఇతనిని తన జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ జట్టులో మెయిన్ స్పిన్నర్‌గా ఎదిగిన సుయాష్, ఈ సీజన్‌లో 7.84 ఎకానమీతో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 34 ఐపీఎల్ మ్యాచుల్లో 24 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కేవలం 75 పరుగులకే ఆలౌట్ చేయడంలో సుయాష్ పాత్ర ఎంతో ఉంది. ఒకవైపు పేసర్లు వికెట్లు తీస్తుంటే, మరోవైపు సుయాష్ పరుగులను కట్టడి చేసి బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ బౌలింగ్ విభాగం ఇప్పుడు లీగ్‌లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us