MI vs SRH: ఈ సారి చిట్టీలు తేలేదా మావా! అభి జేబులు చెక్ చేసిన సూర్య భాయ్! వైరల్ వీడియో!

ముంబై ఇండియన్స్ vs SRH మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం సాధించింది. అయితే అభిషేక్ శర్మ జేబులను సూర్యకుమార్ తనిఖీ చేయడం మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది. ఈ సంఘటనపై వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో అభిషేక్ మంచి ఆరంభం ఇచ్చినా, ముంబై బౌలింగ్ ముందు SRH తడిసి ముద్దయ్యింది.

MI vs SRH: ఈ సారి చిట్టీలు తేలేదా మావా! అభి జేబులు చెక్ చేసిన సూర్య భాయ్! వైరల్ వీడియో!
Surya Abhishek

Updated on: Apr 18, 2025 | 1:13 PM

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సెంచరీ బాదిన అభిషేక్ శర్మ.. అనంతరం జేబులోంచి ఓ నోట్ తీసి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ నోట్‌లో ఈ శతకం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంకితమని అభిషేక్ శర్మ రాసుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ మ్యాచ్‌కు అభిషేక్ శర్మ.. ఈ నోట్‌ను జేబులో పెట్టుకొని బరిలోకి దిగాడని మ్యాచ్ అనంతరం ట్రావిస్ హెడ్ తెలిపాడు. ఎట్టకేలకు పంజాబ్‌పై సెంచరీ సాధించి.. తనదైన నోట్ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడని చెప్పాడు. ఈ సెలెబ్రేషన్స్ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ.. నిన్నటి మ్యాచ్‌లోనూ అలాంటి నోట్ ఏమైనా రాసుకొచ్చాడా? అని సూర్యకుమార్ యాదవ్ చెక్ చేయడం నవ్వులు పూయించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(28 బంతుల్లో 7 ఫోర్లతో 40) నిరాశపర్చాడు. దాంతో ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్(2/14) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విల్ జాక్స్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), ర్యాన్ రికెల్టన్(23 బంతుల్లో 5 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(3/26) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/36) రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..