Sunrisers Hyderabad, IPL 2022: కేన్ మామ కేక పుట్టించేనా.. మరోసారి హైదరాబాద్‌కు ట్రోఫీ అందించేనా?
గత సీజన్‌లోని వివాదాల తర్వాత, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad- SRH) కొత్త జట్టుతో కొత్త సీజన్ కోసం సిద్ధమైంది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వెటరన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నేతృత్వంలో..
గత సీజన్‌లోని వివాదాల తర్వాత, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad- SRH) కొత్త జట్టుతో కొత్త సీజన్ (IPL 2022) కోసం సిద్ధమైంది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు వెటరన్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) నేతృత్వంలోని సన్‌రైజర్స్ జట్టు గత సీజన్‌లో ఘోర వైఫల్యాలను అందుకుంది. అయితే, ప్రస్తుతం వీటిని వదిలి ఈసారి మరింత మెరుగ్గా ఆడేందుకు సిద్ధమైనట్లు భావిస్తు్న్నారు. వేలం తరువాత హైదరాబాద్ జట్టు తన కోచింగ్ స్టాఫ్‌లో బ్రియాన్ లారా, డేల్ స్టెయిన్ వంటి అనుభవజ్ఞులను కూడా చేర్చుకుంది. అయితే గత సీజన్‌లో తప్పిదాల నుంచి జట్టు గుణపాఠం నేర్చుకుని మరోసారి ట్రోఫీని ముద్దాడాలని కోరుకుంటోంది. మరి ఈ సారి ఎలాంటి ఫ్లాన్స్‌తో బరిలోకి దిగనుందో తెలియాలంటే.. అసలు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావాల్సి ఉంది. ఈసారి టీంలో నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, ఐడన్ మార్క్రామ్ వంటి తుఫాన్ ఆటగాళ్లను జట్టు కొనుగోలు చేయడంతో మరోసారి అంచనాలు భారీగా పెరిగాయి.
కెప్టెన్ కేన్‌తో పాటు, సన్‌రైజర్స్ అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను హైదరాబాద్ టీం రిటైన్ చేసింది. అదే సమయంలో భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్ వంటి ఆటగాళ్లను తిరిగి జట్టులోకి చేర్చింది. అయితే మెగా వేలం తర్వాత రషీద్ ఖాన్ లాంటి లెజెండ్‌కు సరైన ప్రత్యామ్నాయం కనుగొనలేకపోయింది. అయినప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లతో కూడిన జట్టుతో సిద్ధమైంది. ఇందులో ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుంది, వారి బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
బలమైన మిడిల్ ఆర్డర్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ గత సీజన్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ పూరన్, ఐదాన్ మర్క్రామ్, అబ్దుల్ సమద్ వంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. జట్టు బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ, అభిషేక్ శర్మను ఓపెనర్‌గా బరిలోకి దింపనున్నాం. అతనికితోడు రాహుల్ త్రిపాఠి ఓపెనింగ్ చేయవచ్చు. ఇక మూడవ నంబర్ కోసం, రాహుల్, కెప్టెన్ కేన్ కూడా అవసరాన్ని బట్టి మారే ఛాన్స్ ఉందని తెలిపాడు.
వాషింగ్టన్ సుందర్ జట్టు తరపున కీలకమైన ఆల్ రౌండర్ పాత్రలో బరిలోకి దిగనున్నాడు. సుందర్ ఇప్పటివరకు టీ20లో బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ, అతనిపై ఆశలు భారీగానే ఉన్నాయి. వీరితో పాటు మార్క్రామ్, అబ్దుల్ సమద్, అభిషేక్ కూడా పార్ట్ టైమ్ స్పిన్ బౌలర్లుగా సత్తా చాటనున్నారు.
ఫాస్ట్ బౌలింగ్‌లో బెస్ట్ ప్లేయర్స్..
ఫాస్ట్ బౌలింగ్‌లో హైదరాబాద్ జట్టుకు చాలా మంచి ఎంపికలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, మార్కో యాన్సన్, రొమారియో షెపర్డ్ లాంటి వారు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ఉమ్రాన్, భువనేశ్వర్‌లు కచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. నటరాజన్, యానాసన్, కార్తీక్‌లలో ఎవరికి చోటుదక్కుతుందో చూడాలి. ఇందులో నటరాజన్ పేరు బలంగా వినిపిస్తోంది. మణికట్టు మాయాజాలంతో లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ కూడా తనదైన రోజున అద్భుతంగా ఆకట్టుకోగలడు. సుందర్ అతనికి మద్దతుగా ఉండే ఛాన్స్ ఉంది.
SRH ప్రాబబుల్ ప్లేయింగ్ 11: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, నికోలస్ పూరన్ (కీపర్), ఐదాన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
Holi 2022: రంగుల్లో తడిసి ముద్దైన క్రికెటర్లు.. బయోబబుల్ దెబ్బకు పాత ఫొటోలతో నెట్టింట్లో హల్‌చల్..