Irfan Pathan : టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్.. సంజు శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పులపై సీనియర్ ప్లేయర్ వార్నింగ్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పతనం, జట్టు వ్యూహాలపై, బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా వ్యూహాత్మక విధానంలోని లోపాలను సూచించారు.

Irfan Pathan : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పతనం, జట్టు వ్యూహాలపై, బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. జట్టు కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా వ్యూహాత్మక విధానంలోని లోపాలను సూచించారు. ముఖ్యంగా, బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సూర్యకుమార్ యాదవ్‌ను మూడవ స్థానంలో పర్మనెంట్ బ్యాట్స్‌మన్‌గా ఉంచాలని పఠాన్ సూచించారు. అలాగే సంజు శాంసన్‌ను స్థానం మార్చి ఆడించడం వల్ల కలిగే నష్టాల పై ఇర్ఫాన్ వివరణ ఇచ్చారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోవడానికి బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలే ప్రధాన కారణమని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించారు. టీమిండియా కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. సంజు శాంసన్‌ను మూడో స్థానంలో పంపించినా, ఆయన కేవలం 2 పరుగులకే అవుట్ కావడంపై విమర్శలు వచ్చాయి. ఈ వైఫల్యంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియాకు పర్మనెంట్ నంబర్ 3 బ్యాట్స్‌మన్‌గా ఉంచాలని సూచించారు.
పఠాన్ ప్రకారం.. టీ20 క్రికెట్‌లో ఫ్లెక్సిబిలిటీ ముఖ్యమే అయినప్పటికీ అది ఒక లిమిట్ వరకు మాత్రమే ఉండాలి. “టీ20 క్రికెట్‌లో ఓపెనర్లు కాకుండా మిగతా ఎవరికీ స్థానం స్థిరంగా ఉండదు. ఫ్లెక్సిబిలిటీ అవసరం అనేది నిజమే. కానీ ఫ్లెక్సిబిలిటీ పేరుతో మీరు స్టెబిలిటీని కోల్పోయేంతగా ఎలాస్టిక్ లా సాగదీయకూడదు. జట్టు డిఫైండ్ రోల్స్ కలిగి ఉండాలి” అని పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో హెచ్చరించారు.
ఇలా లేకపోవడం వల్లనే రెండో టీ20 మ్యాచ్‌లో జట్టు బ్యాటింగ్‌లో పెద్ద నష్టాన్ని చవి చూసిందని ఆయన స్పష్టం చేశారు. సంజు శాంసన్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లను తరచూ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్చడం వల్ల కలిగే నష్టాలను పఠాన్ వివరించారు. ఆసియా కప్‌లో శాంసన్ మిడిల్ ఓవర్లలో పాత బాల్‌తో ఆడాడు. అదే ఆటగాడు ఓపెనింగ్‌లో ఆడటం పూర్తిగా భిన్నం. ఇలా పదే పదే పాత్ర మార్చడం వల్ల బ్యాటర్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోతుందని, ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని పఠాన్ అభిప్రాయపడ్డారు. కేవలం 2 బంతులు ఆడి అవుటైన శివమ్ దూబే విషయంలోనూ అదే జరిగింది. రాణా తర్వాత దాదాపు లోయర్ ఆర్డర్‌లో దూబేను పంపించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు.
పఠాన్ తన విశ్లేషణను ముగించేటప్పుడు సంజు శాంసన్‌కు ఒక మెసేజ్ ఇచ్చారు. “సపోర్ట్ అవసరం లేదనేది లేదు, అతనికి కచ్చితంగా సపోర్ట్ లభిస్తోంది. కానీ ఒక ఆటగాడు వరుసగా మూడు లేదా నాలుగు మ్యాచ్‌లలో విఫలమైతే ఆ సపోర్ట్ కూడా త్వరగా తగ్గిపోతుంది. సంజు శాంసన్ ఈ సిరీస్‌లో మంచి ఇన్నింగ్స్‌తో రాణించాలని ఆశిస్తున్నాను” అని పఠాన్ సూచించారు. ఏదేమైనా మంచి ప్రదర్శన లేకపోతే, జట్టులో స్థానం నిలబెట్టుకోవడం కష్టం అవుతుందని ఆయన హెచ్చరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




