Sreesanth vs Harbhajan : ఆ చెంపదెబ్బతో కోటి రూపాయల బిజినెస్.. హర్భజన్ సింగ్‌పై శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్
Sreesanth vs Harbhajan : హర్భజన్ సింగ్ తనను కొట్టిన విషయాన్ని మార్కెటింగ్ చేసుకుని కోట్లు గడించాడని, సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నాడని శ్రీశాంత్ నిప్పులు చెరిగారు. భజ్జీ ప్రవర్తన నచ్చకే అతడిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశానన్నారు. 2008 ఐపీఎల్ సీజన్లో జరిగిన ఆ చేదు జ్ఞాపకాన్ని శ్రీశాంత్ మళ్ళీ గుర్తు చేసుకున్నారు.

Sreesanth vs Harbhajan : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై భారత మాజీ పేసర్ ఎస్.శ్రీశాంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్భజన్ సింగ్ తనను కొట్టిన విషయాన్ని మార్కెటింగ్ చేసుకుని కోట్లు గడించాడని, సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నాడని శ్రీశాంత్ నిప్పులు చెరిగారు. భజ్జీ ప్రవర్తన నచ్చకే అతడిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశానన్నారు. 2008 ఐపీఎల్ సీజన్లో జరిగిన ఆ చేదు జ్ఞాపకాన్ని శ్రీశాంత్ మళ్ళీ గుర్తు చేసుకున్నారు. హర్భజన్ సింగ్ ఆ ఘటనను ఒక కమర్షియల్ యాడ్ కోసం వాడుకున్నారని, అందుకోసం ఏకంగా ఒక కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని శ్రీశాంత్ ఆరోపించారు. అంతటితో ఆగకుండా, ఆ యాడ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని హర్భజన్ స్వయంగా తనకు ఫోన్ చేసి అడగడం శ్రీశాంత్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆ సమయంలోనే తాను హర్భజన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
సానుభూతి కోసమే ఆ నాటకాలు
ఇటీవలి కాలంలో హర్భజన్ సింగ్ పలు ఇంటర్వ్యూలలో ఆనాటి ఘటన గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. తాను శ్రీశాంత్ కూతురిని కలిశానని, ఆమెతో మాట్లాడిన మాటలు తనను కలిచివేశాయని భజ్జీ చెబుతుంటారు. అయితే ఇవన్నీ పబ్లిసిటీ కోసం ఆడుతున్న నాటకాలని శ్రీశాంత్ కొట్టిపారేశారు. టీవీ కెమెరాల ముందు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ, వ్యక్తిగతంగా మాత్రం ఆ గొడవతో డబ్బు సంపాదించాలని చూడటం హర్భజన్ ద్వంద్వ నీతికి నిదర్శనమని శ్రీశాంత్ మండిపడ్డారు.
క్షమించాను.. కానీ మర్చిపోను
హర్భజన్ సింగ్‌పై వ్యక్తిగతంగా తనకు ఎటువంటి ద్వేషం లేదని, అతడిని ఇప్పటికే క్షమించేశానని శ్రీశాంత్ పేర్కొన్నారు. అయితే, మనకు జరిగిన చెడును క్షమించాలి కానీ మర్చిపోకూడదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మర్చిపోతే అవతలి వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తారని, హర్భజన్ విషయంలో అదే జరుగుతోందని విమర్శించారు. తన ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసే పరిస్థితికి హర్భజన్ తనను తీసుకొచ్చాడని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేంటీ ఆ పాత గొడవ?
2008లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్ మైదానంలోనే శ్రీశాంత్ చెంపపై కొట్టారు. ఆ సమయంలో శ్రీశాంత్ వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దీనిపై విచారణ జరిపిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భజ్జీపై ఆ సీజన్ మొత్తం నిషేధం విధించింది. 18 ఏళ్లు గడిచినా, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఇటీవల ఆ వీడియోను షేర్ చేయడం, అశ్విన్ షోలో భజ్జీ దీనిపై మాట్లాడటంతో ఈ వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
