AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్

ఆ జిల్లాల్లో బయట కాలు పెడితే అంతే !! అధికారుల సీరియస్ వార్నింగ్

Phani CH
|

Updated on: Apr 25, 2026 | 10:59 AM

Share

తెలుగు రాష్ట్రాలను నిప్పుల కొలిమిలా కాల్చేస్తున్న భానుడి ప్రతాపం. ఏప్రిల్‌లోనే 45°C దాటిన ఉష్ణోగ్రతలు, రానున్న రోజుల్లో హీట్‌వేవ్ 2.0 తీవ్రరూపం దాల్చనుందని హెచ్చరికలు. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యం, ఆస్తుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి! ఆకాశం నుంచి సూర్యుడు కరుణ లేకుండా నిప్పులు కురిపిస్తున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేస్తుండటం అందరినీ వణికిస్తోంది. ఇది కేవలం వేసవి కాదు.. ఒక వాతావరణ విపత్తు అని వాతావరణ శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 దాటిందంటే కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పక్షులు గాలిలోనే ప్రాణాలు వదులుతున్నాయి, పశువులు అల్లాడిపోతున్నాయి. రాబోయే మే నెలలో ఈ పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది. తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక శుక్రవారం నుంచి రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారనుంది. మాడు పగిలే ఎండలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు రాష్ట్రంలో హీట్‌వేవ్ 2.0 తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సూర్యుడు ప్రచండంగా మండిపోనున్నాడని.. గత కొద్ది రోజులుగా సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి చాలా జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ మార్కును తాకే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. వేడి గాలి నిప్పు సెగలా తగిలే అవకాశం ఉందన్నారు. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు. పొడి గాలుల ప్రభావంతో ఈ ప్రాంతాల్లో కూడా సాధారణ జీవనం స్తంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయనిచెప్పారు. ఎండల నేపథ్యంలో మున్సిపల్ అధికారుల వినూత్న చర్యలు చేపట్టారు. ఎండ వేడి నుంచి పాదచారులకు, వాహనదారులకు ఉపశమనం కలిగించడానికి కార్పొరేషన్ అధికారులు స్ప్రింక్లర్లను రంగంలోకి దించారు. ప్రధాన మార్గాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటిని జల్లుతూ రోడ్లను చల్లబరుస్తున్నారు. వేసవి కాలంలో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆస్తుల భద్రత కూడా ముఖ్యం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సై పవన్ కుమార్ చేపట్టిన ప్రచారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎండల వల్ల ప్రజలు రాత్రి పూట కిటికీలు తెరిచి ఉంచడం లేదా ఆరుబయట నిద్రించడం చేస్తారు. దీనిని ఆసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆరుబయట పడుకునే వారు విలువైన నగలు, నగదును ఇంట్లోనే భద్రపరుచుకోవాలి. వేసవి సెలవులకు ఊళ్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను అరికట్టవచ్చు. అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే వెంటనే 100కి డయల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం ఏకంగా 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతేకాదు 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 45.4 డిగ్రీలు, కడపలో 45.1 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.1 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు, శుక్రవారం 62 మండలాల్లో తీవ్ర వడగాలులు, 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం విజయనగరం జిల్లాలో 22 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 14 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలు, పోలవరం జిల్లాలో 4 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 4 మండలాలు, కాకినాడ జిల్లాలో 2 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 2 మండలాలు, ఏలూరు జిల్లాలో ఒక మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వేడిగాలులు వీస్తాయి. అంతేకాదు శనివారం 7 మండలాల్లో తీవ్ర వేడిగాలులు.. 31 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి నెలలోనే 35 డిగ్రీలకుపైగా ఎండలు మొదలు కాగా.. మార్చిలో 40 వరకు నమోదయ్యాయి.. ఏప్రిల్ నెలలో ఏకంగా 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోత వాతావరణం ఉంటోంది.. అలాగే పిడుగులతో కూడిన అకాల వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల సాయంత్రం వరకు ఎండలు.. ఆ తర్వాత చిరుజల్లులు కురుస్తున్నాయి. ఒకవైపు మైదాన ప్రాంతాలు మండిపోతుంటే, అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో మాత్రం ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉన్నాయి. మినుములూరు, అరకు ప్రాంతాల్లో 16 నుంచి 18 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రయాగ్‌రాజ్‌లో 44.6 డిగ్రీలు నమోదు కాగా, మధ్యప్రదేశ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 27 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని అత్యంత వేడి నమోదైన 20 నగరాల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. అందులో 19 నగరాలు ఒక్క భారతదేశంలోనే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బీహార్‌లోని భాగల్‌పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ వంటి నగరాలు ప్రస్తుతం నిప్పుల కుంపట్లుగా మారాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవడం కోసం వైద్యులు మరియు అధికారులు ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా తలపాగా లేదా గొడుగు ధరించాలని, ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలను తగినంతగా తీసుకోవాలని పేర్కొంది. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున, వృద్ధులు, చిన్నారులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే తలతిరగడం, వాంతులు, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి. అనవసరంగా బయట తిరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్నం పెట్టిన చేతిని మరువని శునకాలు.. మహిళ హత్య గుట్టు రట్టు

మోమోస్‌ తిన్న బాలికకులివర్‌ డ్యామేజ్.. చివరకు..!

ఆటో డెబిట్ చెల్లింపులపై.. ఆర్‌బీఐ కొత్త రూల్‌

ముక్కు పుడకతో పరీక్ష హాలుకెళ్లిన విద్యార్థిని.. సిబ్బంది ఏం చేసారంటే

35 ఏళ్ల కిందట ల్యాండ్ అయింది.. ఇప్పటికీ అక్కడే..!

Follow Us