WTC Final 2023: ‘ఇదంతా ఐపీఎల్ బ్యాచ్.. చెత్త కెప్టెన్సీకి తోడైన 4 ఓవర్ల బౌలర్లు’
AUSTRALIA VS INDIA , WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రోజు ఆస్ట్రేలియా 3 వికెట్లకు 327 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీపై సౌరవ్ గంగూలీ ప్రశ్నల వర్షం కురిపించాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలి రోజునే ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించి, భారత్‌ను ఏదశలోనూ కోలుకోనివ్వకుండా చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లకు 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ అద్భుతమైన సెంచరీ, స్టీవ్ స్మిత్ కూడా సెంచరీకి కేవలం 5 పరుగుల దూరంలో నిలిచి, భారత బౌలర్లను చితక్కొట్టారు. టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనతో.. ప్రశ్నలు మొదలయ్యాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతోపాటు పలువురు మాజీలు ప్రశ్నలు సంధించాడు.
రోహిత్ శర్మ ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కారణంగా ఆస్ట్రేలియా సులభంగా పరుగులు సాధించిందని స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో సౌరవ్ గంగూలీ విమర్శలు గుప్పించారు. ఒకానొక సమయంలో ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 76గా ఉందని, అయితే రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ను కంగారులు సులువుగా ఛేదించారంటూ చెప్పుకొచ్చాడు. స్టీవ్ స్మిత్, హెడ్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లారంటూ చెప్పుకొచ్చాడు.
శార్దూల్ ఠాకూర్ పైనా ప్రశ్నలు..
శార్దూల్ ఠాకూర్‌పై సౌరవ్ గంగూలీ ప్రశ్నల వర్షం కురిపించాడు. శార్దూల్ లెంగ్త్‌తోపాటు పరుగులు దారాళంగా ఇవ్వడంపై గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను టీమిండియా కెప్టెన్‌గా ఉంటే శార్దూల్‌కి వికెట్లు తీయవద్దని, తన 20 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇవ్వాలని చెప్పి ఉండేవాడినని సౌరవ్ గంగూలీ తెలిపాడు.
ఓవల్ మైదానంలో శార్దూల్ ఠాకూర్ 18 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 4.20 పరుగులుగా ఉంది. ఇది టెస్టుల పరంగా చాలా ఎక్కువ. మహ్మద్ షమీ కూడా ఓవర్‌కు నాలుగు పరుగులు ఇచ్చాడు. ఉమేష్ యాదవ్ విషయంలోనూ అదే జరిగింది. ఫలితంగా తొలి రోజు ఆస్ట్రేలియా 327 పరుగులు చేసింది.
బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు..
ఇర్ఫాన్ పఠాన్ కూడా టీమ్ ఇండియా బౌలింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తాడు. అయితే రెండు నెలల పాటు 4 ఓవర్లు వేసి సడన్ గా టెస్ట్ క్రికెట్ ఆడాల్సి వస్తే ఇలా జరుగుతుందని ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌లో ఆడిన వెంటనే టీమిండియా బౌలర్లు టెస్టు ఫార్మాట్‌కు అలవాటు పడడంలో ఇబ్బంది పడుతున్నారని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..