Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్టార్ ఓపెనర్.. కెప్టెన్ స్మృతి మంధాన ఖాతాలో అత్యంత దారుణమైన రికార్డు
Smriti Mandhana : ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత మహిళా క్రికెట్ తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్ తొలి బంతికే అవుట్ అయి అత్యంత అరుదైన, చెత్త రికార్డును మూటగట్టుకుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించింది.

Smriti Mandhana : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధానకు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో గురువారం రాత్రి జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆమె ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. చేదు జ్ఞాపకాలతో కూడిన ఈ సరికొత్త రికార్డుతో భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అప్రతిష్టాత్మకమైన మైలురాయిని అందుకున్న మొదటి మహిళా ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఇప్పటివరకు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ స్టార్ ప్లేయర్.. ఈసారి మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ మ్యాచ్ ప్రారంభమైన మొదటి బంతికే పెవిలియన్ చేరింది.
చెల్మ్స్‌ఫోర్డ్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేకపోవడంతో స్మృతి మంధాన జట్టును ముందుండి నడిపించింది. టాస్ గెలిచి ఇన్నింగ్స్ ప్రారంభించడానికి షఫాలీ వర్మతో కలిసి క్రీజులోకి వచ్చిన మంధాన.. మ్యాచ్ ఫస్ట్ బాల్‌కే అవుటైపోయింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ వేసిన అద్భుతమైన బంతిని ఆడబోయి చార్లీ డీన్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి దొరికిపోయింది. ఇలా మ్యాచ్‌లోనే మొదటి బంతికి అవుటైన తొలి భారతీయ మహిళా బ్యాటర్‌గా స్మృతి మంధాన అన్వాంటెడ్ రికార్డ్ సృష్టించింది.
భారత టీ20 క్రికెట్ చరిత్రలో పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన రికార్డు 29 ఏళ్ల స్మృతి మంధాన పేరిట ఉంది. కానీ ప్రస్తుత మ్యాచ్‌లో ఆమె ఎదుర్కొన్న ఈ డకౌట్.. కెరీర్‌లో ఆమెకు 6వ టీ20 డకౌట్ కావడం గమనార్హం. భారత్ తరఫున అంతర్జాతీయ మహిళా టీ20ల్లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే అవుటైన రికార్డు షఫాలీ వర్మ (7 సార్లు) పేరిట ఉండగా.. ఇప్పుడు 6 డకౌట్లతో మంధాన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలతో కలిసి సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకుంది.
ఈ ప్రతిష్టాత్మకమైన ఇంగ్లండ్ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడకపోవడం వెనుక ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవని టాస్ సమయంలో స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. దీర్ఘకాలిక షెడ్యూల్ కారణంగా కెప్టెన్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించామని, ఆమె రెండో టీ20 మ్యాచ్ నాటికి తిరిగి జట్టులోకి వస్తుందని మంధాన పేర్కొంది. బిసిసిఐ మహిళల అధికారిక ఎక్స్ ఖాతా కూడా హర్మన్‌ప్రీత్‌కు రెస్ట్ ఇచ్చిన విషయాన్ని, ఆమె స్థానంలో మంధాన జట్టును నడిపిస్తున్న విషయాన్ని నిర్ధారించింది.
తుది జట్లలో ఆడిన ఆటగాళ్లు వీరే
మొదటి టీ20 మ్యాచ్‌లో తలపడిన రెండు జట్ల వివరాలను పరిశీలిస్తే..
భారత జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, నందిని శర్మ, శ్రీ చరణి.
ఇంగ్లండ్ జట్టు: సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, అమీ జోన్స్ (వికెట్ కీపర్), హీథర్ నైట్, ఫ్రెయా కెంప్, డానియెల్ గిబ్సన్, షార్లెట్ డీన్ (కెప్టెన్), ఇస్సీ వాంగ్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
