AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీక్రెట్‌గా ఫోన్ వాడుతూ దొరికిపోయిన ప్లేయర్.. వేటుకు సిద్ధమైన బీసీసీఐ..!

BCCI Fine: చిన్న దేశవాళీ లీగ్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఆట నిబంధనల ముందు ఎవరైనా తలవంచాల్సిందే అని బీసీసీఐ మరోసారి కుండబద్దలు కొట్టింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ ఆల్‌రౌండర్‌ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

సీక్రెట్‌గా ఫోన్ వాడుతూ దొరికిపోయిన ప్లేయర్.. వేటుకు సిద్ధమైన బీసీసీఐ..!
Tnpl 2026, Mobile Phone In Cricket
Venkata Chari
|

Updated on: Aug 15, 2026 | 4:30 PM

Share

BCCI Fine: క్రికెట్ మైదానంలో రూల్స్ బ్రేక్ చేస్తే బీసీసీఐ ఎంత కఠినంగా ఉంటుందో మరోసారి రుజువైంది. మ్యాచ్ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ వాడిన ఓ స్టార్ ఆల్‌రౌండర్‌పై క్రికెట్ బోర్డు కొరడా ఝుళిపించింది. భారీ జరిమానాతో పాటు టోర్నీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే..

డ్రెస్సింగ్ రూమ్‌లో దొరికిపోయిన ఫోన్..

తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL) 2026 సీజన్‌లో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 10వ తేదీన దిండిగల్‌లోని ఎన్‌పీఆర్ కాలేజ్ మైదానంలో ఓ మ్యాచ్ జరుగుతుండగా.. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు ఉండే పీఎంఓఏ (PMOA) ఏరియాలో అకస్మాత్తుగా ఒక మొబైల్ ఫోన్ బయటపడింది. క్రికెట్ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఆడే సమయంలో ప్లేయర్లు తమ వద్ద ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచుకోకూడదు. ఒకవేళ ఉన్నా ముందే అధికారులకు అప్పగించాలి.

మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ లాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ఐసీసీ, బీసీసీఐ అత్యంత కఠినమైన యాంటీ కరప్షన్ కోడ్‌ను అమలు చేస్తున్నాయి. ఈ నిబంధనను తుంగలో తొక్కిన సదరు ఆటగాడు గుట్టుచప్పుడు కాకుండా ఫోన్ వాడినట్లు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

లక్ష రూపాయల ఫైన్.. టోర్నీ నుంచి ఔట్!

పక్కా ఆధారాలతో దొరికిపోవడంతో ఏసీఎస్‌యూ అధికారులు వెంటనే ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్ సంఘం (TNCA) దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఆటగాడికి యాంటీ కరప్షన్ కోడ్ ఉల్లంఘించడం ఇదే తొలిసారి కావడంతో లక్ష రూపాయల భారీ జరిమానా విధించాలని బీసీసీఐకి సిఫార్సు చేశారు. దీనిపై టీఎన్‌సీఏ సెక్రటరీ భగవందాస్ రావు స్పందిస్తూ వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు.

ఏసీఎస్‌యూ రాసిన లేఖ తమకు అందిందని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పూర్తి స్థాయి విచారణ ముగిసే వరకు సదరు ప్లేయర్‌ను మిగిలిన మ్యాచ్‌లకు ఎంపిక చేయొద్దని ఫ్రాంచైజీ యజమానులకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. విచారణ పూర్తయిన తర్వాత చర్యలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆ ప్లేయర్ ఎవరంటే?

ఇంతటి సంచలనానికి కేంద్ర బిందువైన ఆ ఆటగాడి పేరును బీసీసీఐ అధికారికంగా బయటపెట్టలేదు. ఈ సస్పెన్షన్‌కు గురైన ప్లేయర్ తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక స్టార్ ఆల్‌రౌండర్ అని మాత్రమే సమాచారం బయటకు వచ్చింది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటే ఈ కుర్రాడు.. గత సీజన్‌లోనే దేశవాళీ క్రికెట్‌లో రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసినట్లు క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. తన కెరీర్ ఎదుగుతున్న తొలి దశలోనే ఇలా అడ్డంగా బుక్కవడం అతడి భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది.

ఐపీఎల్‌లోనూ ఇలాంటి సీనే..

సరిగ్గా ఇలాంటి ఘటనే ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లోనూ చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ మ్యాచ్ జరుగుతుండగా డగౌట్‌లో కూర్చుని మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కాడు. ఆ సమయంలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. లైవ్ మ్యాచ్‌లో ఫోన్ వాడటం తీవ్రమైన నేరం కింద పరిగణించిన బీసీసీఐ అప్పట్లో భిందర్‌పై కూడా ఏకంగా లక్ష రూపాయల ఫైన్ వేసింది. ఆట పవిత్రతను కాపాడే విషయంలో బోర్డు ఎంత సీరియస్‌గా ఉంటుందో చెప్పడానికి ఈ పరిణామాలే నిదర్శనం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us