AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌లో ఒకే అథ్లెట్ మూడు పతకాలు.. సంచలనం సృష్టించిన భారత రన్నర్

Asian Games 2026: 2026 ఆసియా క్రీడల్లో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 5000 మీటర్ల రేసులో కాంస్యం సాధించి ఒకే ఏషియన్ గేమ్స్‌ లో మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొదటి భారత అథ్లెట్‌గా నిలిచాడు.

Asian Games 2026: ఏషియన్ గేమ్స్‌లో ఒకే అథ్లెట్ మూడు పతకాలు.. సంచలనం సృష్టించిన భారత రన్నర్
Asian Games 2026 (5)
Rakesh
|

Updated on: Sep 29, 2026 | 8:00 PM

Share

Asian Games 2026: జపాన్‎లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల 5000 మీటర్ల పరుగు పందెం ఫైనల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని ముద్దాడాడు. ఈ టోర్నమెంట్‌లో గుల్వీర్ సింగ్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. ఏషియన్ గేమ్స్ చరిత్రలోనే ఒకే ఎడిషన్‌లో మూడు వ్యక్తిగత పతకాలు సాధించిన మొదటి భారతీయ అథ్లెట్‌గా గుల్వీర్ నిలిచాడు. అతని సుదీర్ఘ పరుగు భారత క్రీడా ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించింది.

పురుషుల 5000 మీటర్ల ఫైనల్ పోటీ అత్యంత ఉత్కంఠగా సాగింది. గుల్వీర్ సింగ్ ఈ రేసును 13:32.75 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. బహ్రెయిన్‌కు చెందిన స్టార్ రన్నర్ బిర్హాను బాలేవ్‌ 13:30.79 నిమిషాల సమయంతో మొదటి స్థానం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. అలాగే జపాన్‌కు చెందిన టోమోనోరి యమగుచి 13:31.43 నిమిషాల్లో రేసు ముగించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గుల్వీర్ చివరి క్షణం వరకు పట్టు వదలకుండా పోరాడి భారత్‌కు మరొక మెడల్ తెచ్చిపెట్టాడు.

ఈ 5000 మీటర్ల ఈవెంట్‌లో నిజానికి భారత్ తరఫున ప్రముఖ అథ్లెట్ అవినాష్ సాబ్లే బరిలోకి దిగాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అవినాష్ ఈ పోటీలో పాల్గొనలేకపోయాడు. ఆ స్థానంలో గుల్వీర్ సింగ్‌కు అవకాశం లభించింది. తనకు వచ్చిన అరుదైన అవకాశాన్ని గుల్వీర్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. ట్రాక్‌పై అద్భుత వేగం ప్రదర్శించి కాంస్య పతకం గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విజయంతో ఆసియా అథ్లెటిక్స్ రంగంలో అతడి పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఈ 5000 మీటర్ల రేసులో కాంస్యం సాధించడానికంటే ముందే గుల్వీర్ రెండు రజత పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. 10,000 మీటర్ల సుదీర్ఘ రేసులో 28:29.38 నిమిషాల సమయంతో మొదటి రజతం గెలుచుకున్నాడు. ఆ తర్వాత 1500 మీటర్ల పరుగులో తన వ్యక్తిగత ఉత్తమ రికార్డు (3:36.72 నిమిషాలు) నమోదు చేస్తూ రెండో రజతాన్ని సాధించాడు. ఇప్పుడు 5000 మీటర్ల కాంస్యంతో కలిపి మొత్తం మూడు పతకాలతో టోర్నీని చిరస్మరణీయంగా ముగించాడు.

గుల్వీర్ సింగ్ సాధించిన ఈ చారిత్రక కాంస్య పతకంతో భారత మెడల్స్ సంఖ్య మరింత బలోపేతమైంది. విభిన్న రేసుల్లో వరుసగా ప్రతిభ చూపుతూ భారత క్రీడా రంగానికి సరికొత్త దిశ చూపించాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక్కడే మూడు వ్యక్తిగత పతకాలు సాధించడం సాధారణ విషయమేమీ కాదు. గుల్వీర్ ప్రదర్శించిన పట్టుదల, క్రమశిక్షణ రాబోయే తరం అథ్లెట్లకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఆసియా క్రీడల్లో భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు నమోదు చేస్తున్న ఈ విజయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us