AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : హిట్ మ్యాన్ ఫ్యూచర్‌పై ఊహాగానాలకు బ్రేక్..  అధికారికంగా స్పందించిన బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా

Rohit Sharma : రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ వార్తలకు బీసీసీఐ చెక్ పెట్టింది. లార్డ్స్ వన్డేతో హిట్ మ్యాన్ కెరీర్ ముగియడం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. రోహిత్ ఇంకా జట్టు ప్రణాళికల్లో భాగమేనని వెల్లడించడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది.

Rohit Sharma : హిట్ మ్యాన్ ఫ్యూచర్‌పై ఊహాగానాలకు బ్రేక్..  అధికారికంగా స్పందించిన బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా
Rohit Sharma
Rakesh
|

Updated on: Jul 18, 2026 | 8:38 AM

Share

Rohit Sharma : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, జాతీయ మీడియాలో వస్తున్న వార్తలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఇంగ్లాండ్‌తో ఆదివారం (జూలై 19) లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డే మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలను బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, మీడియాలో వస్తున్న కథనాలన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటన్నింటినీ నేను పూర్తిగా ఖండిస్తున్నాను. లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ తన ఆఖరి వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడనే విషయంపై బోర్డులో ఎలాంటి చర్చా జరగలేదు. అతను భారత వన్డే జట్టులో క్రమబద్ధమైన సభ్యుడిగా ఉన్నాడు. జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం అతను దేశం తరఫున ఆడుతూనే ఉంటాడు. కాబట్టి లార్డ్స్ వన్డే అతని చివరి మ్యాచ్ ఎంతమాత్రం కాదు” అని స్పష్టం చేశారు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే విషయంపై మాత్రం సైకియా ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం గమనార్హం.

అసలు రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ ఎలా మొదలయ్యాయి?

ఈ రిటైర్మెంట్ వివాదం ఎలా మొదలైందంటే.. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వన్డే జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు సుదీర్ఘ అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత వన్డే జట్టులో రోహిత్ శర్మకు చోటు కష్టమేనని సెలక్టర్లు ఇప్పటికే అతనికి సమాచారం అందించినట్లు వార్తలు వచ్చాయి. తన ఫిట్‌నెస్‌పై ఎంత కష్టపడినప్పటికీ, భవిష్యత్తు ప్రణాళికల్లో తన పేరు లేకపోవడంతోనే రోహిత్ రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడనే ప్రచారం జోరందుకుంది.

ఫామ్ లేమితో సతమతమవుతున్న మాజీ కెప్టెన్

ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. మొదటి రెండు వన్డేల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా రోహిత్ బ్యాటింగ్ శైలిని విశ్లేషిస్తూ.. ప్రస్తుతం రోహిత్ శర్మ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోందని, అతని బ్యాటింగ్‌లో ఎప్పుడూ ఉండే స్పష్టత ఈ సిరీస్‌లో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆదివారం జరగబోయే సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో కూడా రోహిత్ విఫలమైతే, అతను రిటైర్ అవుతాడా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా సెలక్టర్లు అతనిపై వేటు వేసే కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

టీమ్ మేనేజ్‌మెంట్‌పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం

మరోవైపు రోహిత్ శర్మకు మద్దతుగా భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక సీనియర్ ఆటగాడికి భవిష్యత్తుపై కనీస స్పష్టత ఇవ్వకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ రోహిత్ శర్మను పక్కన పెట్టాలని అనుకుంటే, ఆ విషయాన్ని 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే చెప్పాల్సి ఉందని, అలా కాకుండా 2026 మధ్యలో అతను ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఇలాంటి వార్తలు రావడం సరికాదన్నారు. భారత జట్టులో ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కు మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండటం లేదని, తన అంతర్జాతీయ రిటైర్మెంట్ కూడా ఇలాంటి లోపభూయిష్ట కమ్యూనికేషన్ వల్లే జరిగిందని అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వన్డే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు ఇవే

భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకడైన రోహిత్ శర్మ వన్డే కెరీర్ రికార్డులు అసాధారణమైనవి. అతను ఇప్పటివరకు భారత్ తరఫున 287 వన్డే మ్యాచ్‌లు ఆడి 48.58 సగటుతో 11,757 పరుగులు సాధించాడు. ఇందులో 33 సెంచరీలు ఉన్నాయి. ఒకవేళ లార్డ్స్ వన్డే తర్వాతే అతని వన్డే ప్రయాణానికి తెరపడినా.. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ 7వ స్థానంలో నిలిచిపోతాడు. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ సిరీస్ 1-1తో సమం కాగా, ఆదివారం జరగబోయే ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన బ్యాట్‌తో విమర్శకులకు సమాధానం చెబుతాడో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us