Next Test Captain: బుమ్రా కీలక నిర్ణయం.. కెప్టెన్సీ రేసు నుంచి సైడ్.. ఇక కెప్టెన్ అతడేనా?
జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ముందు బీసీసీఐకు పెద్ద సవాల్ ఎదురైంది. తాజాగా టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు కొత్త సారథిని ఈ నెలలోనే బీసీసీఐ ఎంపిక చేయాల్సి ఉంది. అయితే రోహిత్ స్థానంలో బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిద్దామనుకున్న బీసీసీఐకు బుమ్రా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా తప్పుకున్నట్టు తాజా నివేదికల ప్రకారం తెలుస్తోంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంట నెలకొంది.

టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్ కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ వస్తుంది. అయితే రోహిత్ తర్వాత జట్టు బాధ్యతలు బుమ్రాకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు కొంత ప్రచారం జరిగింది. అయితే అతను గత కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతుండడంతో ఈ బాధ్యతలు తీసుకుంటారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో కెప్టెన్సీ రేసులో మరో ఇద్దరు పేర్లు కూడా వినిపించాయి. అందులో యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేర్లు ఉన్నాయి. అయితే మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే టెస్ట్ కెప్టెన్సీ రేసు నుంచి బుమ్రా తప్పుకుంటున్నాడని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఓ స్పోర్ట్స్ ఛానెల్ నివేదిక ప్రకారం పనిభారం, వెన్నుకొప్పి కారణంగా ఐదు మ్యాచుల సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లోని అన్ని మ్యాచులు ఆడుతానని హామీ ఇవ్వలేనని బుమ్రా సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక బుమ్రా కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అంతటా నిలకడగా ఆడగల ప్లేయర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపవచ్చని నివేదికలు చెబుతున్నాయి. బుమ్రా కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవడంతో తర్వాత రేసులో ఉన్న శుభమన్ గిల్, రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ చూస్తోంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా మరొకరికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. అయితే జూన్‌లోనే ఈ టెస్ట్ సిరీస్ ఉండడంతో ఈ నెలాఖరులోపే సెలక్టర్లు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
2022 నుండి భారత పురుషుల టెస్ట్ జట్టు నాయకత్వంలో భాగమైన బుమ్రా, మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ముఖ్యంగా, బుమ్రా నాయకత్వంలో భారత్ జట్టు ఇండియా vs ఆస్ట్రేలియా సిరీస్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత వెన్ను నొప్పి, గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




