Telangana: పాలమూరు యువ క్రికెటర్‌కు అరుదైన అవకాశం… ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ తరపున ఆడే ఛాన్స్.
క్రికెట్ దశాబ్ధాలుగా యావత్ భారతాన్ని ఊపు ఊపుతున్న క్రీడ. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్ భారతీయులకు ఓ ఎమోషన్. ఆటకు వన్నె తెచ్చిన ఒకప్పటి లెజెండ్స్ వయసు మీరి వైదొలిగినా.. మెరికల్లాంటి కొత్త కొత్త ప్లేయర్స్ జాయిన్ అవుతున్నారు. ఖరీదైన ఆటగా భావిస్తున్న ఈ గేమ్‌లో పాలమూరు జిల్లా యువకుడు ప్రతిభ చాటుతున్నాడు. ఏకంగా ఇంగ్లాండ్ క్రికెట్ కౌంటీలకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

పేద కుటుంబంలో పుట్టి ఖరీదైన క్రికెట్ ఆటలో రాణిస్తున్నాడు పాలమూరు కుర్రాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపురానికి చెందిన గణేష్ చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే ఎంతో మక్కువ. ఆర్థిక స్థోమత లేకపోయినా కుమారుడి ఆసక్తి, ప్రతిభను చూసి తల్లితండ్రులు సుధ, రమేశ్‌లు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన అండర్ -14, 16, 19 సీనియర్స్ టోర్నిల్లో గణేష్ మంచి ప్రదర్శన చేశాడు. రెండేళ్ల క్రితం HCA నిర్వహించిన జోనల్స్ పోటీల్లో రాణించి రంజీ ట్రోఫీ టోర్నీలో పాల్గొనే జట్టులో చోటు సంపాదించాడు.
HCA ఆధ్వర్యంలో నిర్వహించే 3డే, 2డే లీగ్ టోర్నీలతో పాటు SGF పోటీల్లోనూ గణేష్ రాణించాడు. 2022-23 సీజన్ లో జరిగిన HCA జోనల్ టోర్నీలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో జట్టు తరపున రెండు మ్యాచుల్లో 287 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు. 2020లో నిర్వహించిన 3డే లీగ్ 8 మ్యాచ్‌లలో 609 పరుగులు చేసి, ఆరు వికెట్లు కైవసం చేసుకున్నాడు. ఇదే ఏడాది 2డే లీగ్‌లో జిల్లా జట్టు తరపున ట్రిపుల్ సెంచరీ (318) నాటౌట్ గా నిలిచాడు. 2021లోనూ 3డే లీగ్ ఆరు మ్యాచ్‌లలో 228 పరుగులు, 11వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఇక ఇంగ్లాండ్ లోని చెల్టెన్ హోం నగరంలోని హెచ్ఆర్సీసీ క్లబ్ జట్టు తరపున ఆడేందుకు గణేష్‌కు అవకాశం లభించింది. ఈ మేరకు ఆరు నెలల ఒప్పందం కుదిరింది. ఈ ఆరు నెలల్లో 5 సిరీస్ మ్యాచుల్లో గణేష్ ఆడనున్నాడు. అన్నీ కలిపి దాదాపుగా 20 మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ టోర్నీల్లో మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటే వచ్చే 8ఏళ్ల పాటు గణేష్‌తో హెచ్ఆర్సీసీ సీ జట్టు ఒప్పందం చేసుకోనున్నది. ఇక ఇదే రకంగా రాణిస్తే భవిష్యత్‌లో ఐపీఎల్ వంటి టోర్నీలో ఎంపికై అంతర్జాతీయ క్రీడాకారులతో కలిసి ఆడే ఛాన్స్ లభిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




