Nitish Rana : ఏంట్రా ఇది? వన్ మ్యాన్ షోనా? 3 రోజుల్లో 3 అద్భుత ఇన్నింగ్స్‌లు.. దెబ్బకు డీలాపడ్డ ప్రత్యర్థి జట్టు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 టైటిల్‌ను వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు గెలుచుకుంది. ఈ విజయం వెనుక కెప్టెన్ నితీష్ రాణా మూడు రోజుల్లో ఆడిన వరుసగా మూడు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. ఫైనల్‌లో వెస్ట్ ఢిల్లీ జట్టు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, DPL చరిత్రలో రెండవ విజేతగా నిలిచింది.

Nitish Rana : ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2025 సీజన్ విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ నిలిచింది. ఈ విజయంలో జట్టు కెప్టెన్ నితీష్ రాణా కీలక పాత్ర పోషించాడు. కేవలం 3 రోజుల్లోనే వరుసగా మూడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి, ఫైనల్‌లో తన జట్టును గెలిపించాడు. ఆదివారం, ఆగస్టు 31న జరిగిన ఫైనల్‌లో వెస్ట్ ఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో సులభంగా ఓడించింది. సెంట్రల్ ఢిల్లీ 173 పరుగులు చేయగా, వెస్ట్ ఢిల్లీ ఆ లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించింది. నితీష్ రాణా మరో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఫైనల్ మ్యాచ్‌లో మెరిసిన స్టార్స్
అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే, వారి ఇన్నింగ్స్ ఆరంభం అంత బాగా లేదు. కేవలం 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన యుగల్ సైనీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కానీ మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఒకానొక దశలో 78 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశం కోల్పోయింది.
ఈ క్లిష్ట సమయంలో యుగల్ సైనీ బాధ్యత తీసుకొని, 8వ స్థానంలో వచ్చిన ప్రాంషు విజయరన్‌తో కలిసి అద్భుతమైన పార్టనర్ షిప్ నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి 78 పరుగులు జోడించి జట్టు స్కోర్‌ను 150 దాటించారు. యుగల్ 48 బంతుల్లో 65 పరుగులు చేయగా, ప్రాంషు కేవలం 24 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో మన్నన్, శివంక్ చెరో 2 వికెట్లు తీసుకోగా, కెప్టెన్ నితీష్ రాణా 4 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
నితీష్ రాణా విధ్వంసం
174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్ట్ ఢిల్లీకి కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సిమర్‌జీత్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి సెంట్రల్ ఢిల్లీకి ఆశలు కల్పించాడు. అయితే, ఆ తర్వాత అంకిత్ కుమార్ 48 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నితీష్ రాణా బాధ్యత తన భుజాల మీద వేసుకుని విజృంభించాడు.
ఫైనల్‌కు ముందు శుక్రవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో 134 పరుగుల (నాటౌట్), శనివారం క్వాలిఫైయర్-2లో 45 పరుగుల (నాటౌట్) ఇన్నింగ్స్‌లతో చెలరేగిన నితీష్, ఫైనల్‌లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. నితీష్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హృతిక్ షౌకీన్ (45 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరికి 18వ ఓవర్ చివరి బంతికి హృతిక్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




