Team India: కపిల్‌దేవ్ అంతటివాడవుతాడని అనుకుంటే.. తుస్సుమనిపించి షెడ్డుకెళ్లాడు.. మరి రీ-ఎంట్రీ ఎలా.?
తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీమిండియాలో చోటు సంపాదించుకునేందుకు కష్టపడుతున్నాడు. గతంలో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఇటీవలకాలంలో అంచనాలు అందుకోలేక, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఫాంలేమితో సతమతమవుతున్నాడు. అంచనాలు అందుకోలేక టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. మూడు ఫార్మాట్ల ప్లేయర్‌గా గుర్తింపు సాధించినప్పటికీ, టీమిండియాలో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మళ్లీ భారత జట్టు తలుపు తట్టడం అంత సులభం కాదేమో అనే చర్చ జరుగుతోంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తేనే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు మాజీ క్రికెటర్లు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2024లో 303 పరుగులు సాధించాడు నితీష్ కుమార్ రెడ్డి. బౌలింగ్‌లోనూ తన ప్రతిభను కనబరిచాడు. దీంతో సెలెక్టర్ల దృష్టిలో పడి టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో రాణించి, 49 బంతుల్లోనే 74 పరుగులతో మెప్పించాడు. ఆ తర్వాత టెస్టుల్లోనూ అవకాశం దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు పేస్ ఆల్-రౌండర్‌గా ఎంపికయ్యాడు. భీకరమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని మెల్‌బోర్న్‌లో ఒక చిరస్మరణీయ శతకం నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతో నితీష్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోయింది. భారత జట్టుకు సరైన పేస్ ఆల్-రౌండర్ దొరికినట్లేనని మాజీలు సైతం కితాబిచ్చారు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అనే వాదన కూడా వినిపించింది. అయితే, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తర్వాత ఈ తెలుగు కుర్రాడు అంచనాలను అందుకోలేక.. ఫిట్‌నెస్ సమస్యలతోనూ సతమతమయ్యాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ తర్వాత ఆరు టెస్టుల్లో కలిపి నితీష్ కుమార్ రెడ్డి కేవలం 102 పరుగులు మాత్రమే సాధించాడు. ఇంగ్లాండ్ టూర్‌కు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగినా.. అదే సమయంలో ఫిట్‌నెస్ సమస్యలతో సిరీస్ మధ్యలోనే జట్టు నుంచి బయటకు వచ్చాడు.
స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో అవకాశం దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టుకు ఎంపికైనప్పటికీ, ఆ తర్వాత జట్టు నుంచి రిలీజ్ అయ్యాడు. గిల్ గాయపడటంతో రెండో టెస్టులో ఆడే అవకాశం నితీష్‌కు లభించినా, తన ఆటతీరుతో నిరాశపరిచాడు. కష్టాల్లో ఉన్నప్పుడు భారత జట్టును ఆదుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ మెప్పించలేకపోయాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టుతోపాటే ఉన్నా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2025లో ఇప్పటివరకు ఒకే ఒక్క టీ20 ఆడే ఛాన్స్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డి మళ్లీ టీమిండియా దృష్టిని ఆకర్షించాలంటే, దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకోవాలని చర్చ సాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ చూడండి








