ఆటో డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్, రోయ్యల వ్యాపారి కొడుకులను స్టార్స్‌ని చేస్తున్నారు! హ్యాట్సాఫ్ ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ, విగ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్ లాంటి యువ క్రికెటర్ల ప్రతిభ ఆకట్టుకుంది. ముఖ్యంగా విగ్నేష్ పుతుర్ అద్భుతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ముగ్గురు క్రికెటర్ల నేపథ్యాలు ప్రేరణాదాయకంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ యువతను ప్రోత్సహించడం అభినందనీయం.

ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్‌ను ఆదివారం ఆడేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనా.. వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే.. ముంబై ఇండియన్స్ నెక్ట్స్ జనరేషన్ క్రికెటర్ల కోసం పెడుతున్న ఎఫర్ట్స్ అలా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో ముంబై ఓడిపోయి ఉండుచ్చు గాక.. కానీ, నిన్నటి మ్యాచ్‌లో ఓ ముగ్గురు క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షించారు. విగ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్. ఈ ముగ్గురు యువ క్రికెటర్లకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం కల్పించింది. వీరిలో సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్ అంతగా ఆకట్టుకోకపోయినా.. విగ్నేష్ పుతుర్ మాత్రం అద్భుతమైన బౌలింగ్ ధోని మనసును కూడా గెలుచుకున్నాడు.
ఆట సంగతి పక్కనపెడితే వీరి నేపథ్యాలు మాత్రం కచ్చితంగా కొన్ని కోట్ల మందికి స్ఫూర్తి ఇస్తుంది. ముందుగా విగ్నేష్ పుతుర్ గురించి మాట్లాడుకుంటే.. ఇతను కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్. పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. చాలా పేద కుటుంబం అయినా కూడా క్రికెట్‌పై పిచ్చి ఇష్టంతో ఈ ఆటను కెరీర్‌గా మల్చుకున్నాడు. అయితే ఈ యంగ్ క్రికెటర్‌పై ముంబై ఇండియన్స్ చాలా ఖర్చు పెట్టింది. కేరళా క్రికెట్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ వంటి వాటిలో ఇతని ప్రదర్శన చూసి ముంబై ఇండియన్స్ టాలెంట్ హంట్ టీమ్ ఇతన్ని తమ టీమ్‌లోకి తీసుకుంది. ఐపీఎల్ మెగా వేలంలో రూ.30 లక్షలతో కొనుగోలు చేసింది. అలాగే ఇటీవలె సౌతాఫ్రికాకు పంపించి మంచి ట్రైనింగ్ ఇప్పించింది. దాని ఫలితమై సీఎస్‌కే లాంటి స్ట్రాంగ్ టీమ్‌పై మూడు వికెట్లు సాధించాడు.
రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, దీపక్ హుడా లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ప్లేయర్ రాబిన్ మింజ్.. ఇతను జార్ఖండ్‌కు చెందిన గిరిజన జాతి ముద్దు బిడ్డ. ఐపీఎల్‌లో ఆడిన తొలి భారత గిరిజన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆదివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్ ఇతనికి కూడా తొలి ఐపీఎల్ మ్యాచ్. నిజానికి 2024లో ఇతన్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసినా.. బైక్ యాక్సిడెంట్‌లో గాయపడటంతో ఆ సీజన్‌కు దూరం అయ్యాడు. తిరిగి కోలుకున్న మించ్‌ను ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 65 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మించ్ తండ్రి ఒక సాధారణ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్. కొడుకు క్రికెటర్‌గా ఎదిగి ఐపీఎల్ ఆడుతున్నా.. వాళ్ల నాన్న ఇప్పటికీ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. తన సంపాదనతోనే కుటుంబం నడపాలనే గొప్ప ఆత్మాభిమానం ఆయనది. కొడుకు ఈ స్థాయికి చేరుకున్నా.. తాను పని చేయడం మానని అంటున్నారు.
ఇక మూడో ప్లేయర్ మన తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు. ఈ కుర్రాడు కాకినాడకు చెందిన ప్లేయర్. రాజు తండ్రి రోయ్యల వ్యాపారి. పుతుర్, మింజ్ అంత పేదరికం కాకపోయినా.. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సత్యనారాయణ రాజు గురించి చెప్పుకోవచ్చు. ఇతన్ని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కు కొనుగోలు చేసింది. ఇలాంటి యువ క్రికెటర్లను ప్రొత్సహిస్తూ.. ఐపీఎల్ లాంటి ఒక పెద్ద క్రికెట్ ప్లాట్‌ఫామ్‌పై అవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. వాళ్లకున్న వ్యాపార విలువలు వాళ్లకి ఉన్నా.. యువ క్రికెటర్లను ఎంకరేజ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇండియాకు కూడా మంచి క్రికెటర్లను అందించిన వాళ్లు అవుతారు. డొమెస్టిక్ క్రికెటర్‌లో ఎంత మంచి ప్రదర్శనలు చేసినా.. వచ్చే గుర్తింపు కంటే ఐపీఎల్‌లో మెరిస్తే వచ్చే గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. మరి యువ క్రికెటర్లపై ఇంత ఖర్చుపెట్టి, ఫ్రాంచైజ్‌తో పాటు క్రికెటర్ల భవిష్యత్తుకు, పరోక్షంగా టీమిండియా భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..