AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఇద్దరి నోటి దూల.. టీమిండియాకు ఒక సింహాన్ని అందించింది!

పాకిస్థాన్‌తో 2005లో విశాఖపట్నంలో జరిగిన వన్డేలో 123 బంతుల్లో 148 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. నవీద్‌ ఉల్‌ హసన్‌ రాణా, షాహిద్‌ అఫ్రిదీతో జరిగిన మాటల యుద్ధం తర్వాత మరింత రెచ్చిపోయాడు. 15 ఫోర్లు, 4 సిక్సర్లతో తొలి వన్డే సెంచరీ సాధించి, తనలోని సత్తాను ప్రపంచానికి చూపించాడు.

ఈ ఇద్దరి నోటి దూల.. టీమిండియాకు ఒక సింహాన్ని అందించింది!
Dhoni 148 Vs Pakistan
SN Pasha
|

Updated on: Aug 23, 2026 | 12:57 PM

Share

టీమిండియాకు ఒక సింహం లాంటి ఆటగాడు దొరికిన రోజు అది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు.. జూలు లాంటి జుట్టుతో రాజసంగా కనిపిస్తాడు.. షాట్ కొడితే సింహం వేట కంటే సాలిడ్‌గా ఉంటుంది. అందుకే అతన్ని సింహంతో పోల్చాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సింహం ఎవరో తెలిసే ఉంటుంది. ఎస్.. అతనే మహేంద్ర సింగ్ ధోని. అయితే ధోని ఇంత గొప్ప ప్లేయర్ అవ్వడానికి ఇద్దరు పాక్ ఆటగాళ్ల నోటి దూల కూడా ఒక కారణం. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇది 2005 నాటి సంగతి. అప్పుడప్పుడే టీమిండియాలోకి ధోని అడుగులు పడుతున్న రోజులు. టీమిండియా కెప్టెన్‌ దాదా అండ ధోనికి మెండుగా ఉన్న కాలం.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్

2005 ఏప్రిల్ 5.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్. ఇప్పటికంటే అప్పట్లో.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఒక యుద్ధానికి తక్కువేం కాదు అనుకునే రోజులు. ఇప్పుడంటే పాకిస్థాన్ అంటే ఓ పిల్లబచ్చా టీమ్‌లా కనిపిస్తోంది కానీ, అప్పట్లో అలా కాదు. టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేది. అలాంటి ప్లేయర్లతో కూడిన పాక్ టీమ్‌తో మన విశాఖపట్నం వేదికగా వన్డే మ్యాచ్. టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

కేవలం రెండు పరుగులకే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అవుట్. అంతే పాకిస్థాన్‌కు కొండంత బలం వచ్చేసింది. సగం మ్యాచ్ గెలిచేశాం అని సంతోషపడిపోయారు. ఈలోపే గంగూలీ మెదడు పాదరసంలా పనిచేసింది. చిన్న ప్రయోగం చేస్తూ ధోనిని వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపాడు. అంతా షాక్ అయ్యారు. పాకిస్థాన్ బౌలర్లకు కూడా అర్థం కాలేదు. ఈ పిల్లాడిని బ్యాటింగ్‌కు పంపారు ఏంటి అని. అయితే సచిన్ వికెట్ పడినా కూడా మరో ఎండ్‌లో పాకిస్థాన్‌ పాత మొగుడు వీరేందర్ సెహ్వాగ్ ఇరగదీస్తూనే ఉన్నాడు. 4 ఓవర్లలోనే స్కోర్ 40 దాటించాడు. టీ20 క్రికెట్ పుట్టని కాలంలోనే పాక్ బౌలర్లకు టీ20 స్టైల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు.

సెహ్వాగ్ మొదలెడితే.. ధోని చిదిమేశాడు..

సెహ్వాగ్ స్పీడ్‌ను కంటిన్యూ చేయాలనే గంగూలీ ధోనిని దింపాడు. దాదా అనుకున్నట్లే ధోని కూడా వచ్చీ రావడంతో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఎవడ్రా వీడు పిల్లా బచ్చాలా ఉన్నాడు కానీ ఇరగదీస్తున్నాడని పాక్ బౌలర్లకు మండిపోయింది. ఇంకేముంది వాళ్లకు అలవాటైన నోటి దూలను ప్రయోగించారు. ముందుగా నవీద్ ఉల్ హసన్ రాణా ధోనిపై నోరు పారేసుకున్నాడు. తన బౌలింగ్‌లో బౌండరీ కొట్టాడనే కోపంలో ఏదో వాగేశాడు. ధోని అతన్ని పట్టించుకోలేదు. ఆ వెంటనే అసలైనోడు దిగాడు.. అతనే షాహిద్ అఫ్రిదీ. అతని బౌలింగ్ చూసి ఆడుదాం అనుకున్నాడో ఏమో.. ఓ రెండు బాల్స్ డిఫెన్స్ ఆడాడు. బంతి ప్యాడ్లకు తగిలింది. పెద్దగా అపీల్ చేశాడు అఫ్రిదీ. కానీ, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

దీంతో.. నీ సంగతి ఇలా ఉందా అంటూ ధోని నెక్ట్స్ బాల్‌కే భారీ షాట్ ఆడాడు. అంతే అఫ్రిదీ నోరేసుకొని పడిపోయాడు. ధోనిని బూతులు తిట్టాడు. అంతే ఇక అక్కడి నుంచి ధోని విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా అఫ్రిదీని అయితే టార్గెట్ చేసి మరీ కొట్టాడు. 74 రన్స్ చేసి అవుట్ అయిన సెహ్వాగ్.. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ధోని బ్యాటింగ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. భారీ భారీ షాట్లతో ధోని విధ్వంసం సృష్టిస్తుంటే టీమ్ అంతా ఆశ్చర్యపోయింది. కెప్టెన్ దాదా మాత్రం ఇట్స్ మై ప్రోడక్ట్ అంటూ ఒకింత గర్వంగా కనిపించాడు. అలా ధోని విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తేలిపోయారు. మొత్తంగా 123 బంతుల్లోనే 4 సిక్సులు 15 ఫోర్లతో 148 పరుగులు బాదేశాడు. మరో విశేషం ఏంటంటే.. ధోనికి ఇదే తొలి వన్డే సెంచరీ. ఇలా పాక్ ఆటగాళ్లు బూతులతో రెచ్చిపోతే ధోని తన బ్యాటింగ్‌తో బదులిచ్చాడు. అక్కడి నుంచి అందరికీ తెలిసిందే.. ధోని తిరుగులేని శక్తిగా మారిపోయాడు. కెప్టెన్ అయ్యాడు, గొప్ప ఫినిషర్ అయ్యాడు, టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013 అందించి.. భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us