IND vs PAK: ఒక్క బంతితో మ్యాచ్ మార్చేసిన శివమ్ దూబే.. సైమ్ అయూబ్ వికెట్ వెనుక అసలు కథ ఇదే!
IND vs PAK: ఆసియా క్రీడలు 2026 క్రికెట్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ దూకుడుగా ఆడింది. కీలక సమయంలో శివమ్ దూబే తొలి బంతికే సైమ్ అయూబ్‌ను ఔట్ చేయగా, వాషింగ్టన్ సుందర్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. హసన్ నవాజ్ 96 పరుగులు చేసినా భారత్ మ్యాచ్‌ను నిలబెట్టుకుంది.

IND vs PAK: ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ ఫైనల్‌లో భారత్ అదరగొట్టింది. పాకిస్థాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, తిలక్ వర్మ 22 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేశాడు.
అభిషేక్, తిలక్ దూకుడుతో భారీ స్కోరు
భారత్ ఇన్నింగ్స్‌కు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. 28 బంతుల్లో 61 పరుగులు చేసిన అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. వైభవ్ సూర్యవంశీ 15 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 21 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 20 పరుగులు జోడించాడు. చివర్లో తిలక్ వర్మ 22 బంతుల్లో 51 నాటౌట్‌తో స్కోరును 200 దాటించాడు. శివమ్ దూబే కూడా 15 బంతుల్లో 27 పరుగులు చేసి కీలక సహకారం అందించాడు.
చితక్కొట్టిన హసన్ నవాజ్
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో హసన్ నవాజ్, సైమ్ అయూబ్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఇద్దరూ కలిసి 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. సైమ్ అయూబ్ 22 బంతుల్లో 29 పరుగులు చేయగా, హసన్ నవాజ్ మాత్రం భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
DUBE WITH THE GOLDEN ARM!
All-round impact when it matters most 🏏🔥
Watch Pakistan vs India in the 20th Asian Games Gold Medal Match, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026 #BaarBaarBharatHarBaarBharat pic.twitter.com/sDZ2y7ImBU
— Sony Sports Network (@SonySportsNetwk) October 3, 2026
తొలి బంతికే దూబే దెబ్బ.. సుందర్ సూపర్ క్యాచ్
పాకిస్థాన్ స్కోరు 126 పరుగులకు చేరుకున్న సమయంలో 14.1 ఓవర్‌లో శివమ్ దూబే బంతిని అందుకున్నాడు. బౌలింగ్‌కు వచ్చిన వెంటనే తన తొలి బంతికే సైమ్ అయూబ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దూబే వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని అయూబ్ ల్యాప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా, బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేదు. బంతి స్క్వేర్ లెగ్ వైపు గాల్లోకి వెళ్లింది. అక్కడ ఉన్న వాషింగ్టన్ సుందర్ వేగంగా ముందుకు దూసుకొచ్చి డైవ్ చేస్తూ రెండు చేతులతో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వికెట్‌తో పాకిస్థాన్ 35 బంతుల్లో 86 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో పడింది.
దూబే, సుందర్ బౌలింగ్‌తో భారత్‌కు గోల్డ్
సైమ్ అయూబ్ వికెట్ తర్వాత కూడా హసన్ నవాజ్ పోరాటం కొనసాగించాడు. అతడు 51 బంతుల్లో 96 పరుగులు చేసి పాకిస్థాన్‌ను గెలుపు దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే భారత బౌలర్లు చివరి దశలో ఒత్తిడి పెంచారు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 29 పరుగులకు 2 వికెట్లు తీశాడు. శివమ్ దూబే 3 ఓవర్లలో 33 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ కూడా 2 వికెట్లు తీశాడు. చివరి ఓవర్‌లో పాకిస్థాన్‌కు 33 పరుగులు కావాల్సి ఉండగా, భారత్ లక్ష్యాన్ని కాపాడుకుంది. పాక్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచి ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
