AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మూఢనమ్మకానికి బలైన మహిళా జీవితం.. దెయ్యం పేరుతో దారుణం..

తెలంగాణలో మూఢనమ్మకం ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్నట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రియాంక మాల్‌కు దెయ్యం పట్టిందనే అనుమానంతో భర్త, అత్తమామలు బెల్టుతో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో మెట్లపై నుంచి పడిపోయిన ఆమె హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Telangana: మూఢనమ్మకానికి బలైన మహిళా జీవితం.. దెయ్యం పేరుతో దారుణం..
Priyanka Mal
M Revan Reddy
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 12:01 PM

Share

అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లాలి.. వైద్యులను సంప్రదించాలి.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. కానీ ఇప్పటికీ సమాజంలో వేళ్లూనుకున్న కొన్ని మూఢనమ్మకాలు మనుషుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అనారోగ్యాన్ని కూడా దెయ్యం పట్టడం, గాలి సోకడం అంటూ అపోహలతో ముడిపెట్టి.. ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఘటన ఈ మూఢనమ్మకాల తీవ్రతను మరోసారి బయటపెట్టింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళకు వైద్యం అందించాల్సింది పోయి.. దెయ్యం పట్టిందనే అనుమానంతో దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

రాజస్థాన్ రాష్ట్రం బార్మేర్ జిల్లా సోమేసరా నయా గ్రామానికి చెందిన ప్రియాంక మాల్‌ (26), తన భర్త పరాస్ మాల్‌తో కలిసి కొంతకాలం క్రితం తెలంగాణకు వలస వచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో నివాసం ఉంటూ కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్న ప్రియాంక.. ఇటీవల కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే, ఆమెకు వచ్చిన అనారోగ్యాన్ని వైద్య సమస్యగా చూడాల్సిన కుటుంబ సభ్యులు.. గాలి సోకిందని, దెయ్యం పట్టి ఉంటుందని అనుమానించినట్లు సమాచారం.

ఈ క్రమంలో ప్రియాంక ఒంటిపై దెబ్బలు కొడితే ఏదైనా దుష్టశక్తి ఉంటే వెళ్లిపోతుందని మాంత్రికులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో భర్త పరాస్ మాల్‌తో పాటు అత్త, మామలు ఆమెను బెల్టుతో కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దెబ్బలు తాళలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ప్రియాంక మెట్లపై నుంచి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. వైద్య పరీక్షల్లో ఆమెకు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఫిర్యాదు మేరకు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ధైర్యం చెప్పి, సరైన వైద్యం అందించాల్సిన కుటుంబ సభ్యులే దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జబ్బుకు వైద్యం చేయించాల్సింది పోయి.. మూఢనమ్మకాల పేరుతో దాడులకు పాల్పడటం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. అనారోగ్యానికి మంత్రాలు, దెబ్బలు పరిష్కారం కాదు.. సరైన వైద్యమే మార్గం.

Follow Us