హాస్పటల్లో ఉంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు, సాయం చేయలేదు.. నాకు భజన చేయడం రాదు: చంటి
తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న చలాకీ చంటి, ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ వెనుక ఉన్న ఎన్నో చేదు నిజాలను, భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. పరిశ్రమలో కళాకారులు ఎదుర్కొనే సమస్యలు, భజన సంస్కృతి, ఈగో వంటి అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జబర్దస్త్ కమెడియన్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో చలాకి చంటి ఒకరు . తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు చంటి. జబర్దస్త్ తర్వాత కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు చంటి. గతంలో చంటి ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను వెల్లడించారు. తన అనారోగ్యం, సినీ రంగంలో అవకాశాలు కోల్పోవడం, స్నేహితుల నుంచి లభించని మద్దతు వంటి అనేక విషయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన గుండె సంబంధిత సమస్యలు, బైపాస్ సర్జరీపై యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు వార్తలు ప్రచారం చేశాయని చలాకి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎవరూ పట్టించుకోనప్పుడు, కనీసం తన అనారోగ్యం గురించి వార్తలు రాయడం ద్వారా వారికి తాను ఉపయోగపడ్డానని ఆయన సరదాగా అన్నారు. “చంటి జీవితం అయిపోయింది” అని ప్రచారం చేసిన వారికి వార్నింగ్ ఇచ్చాడు చంటి. తన కెరీర్ ను దెబ్బతీయడానికి, తన గురించి తప్పుడు ప్రచారం చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరూ సర్వనాశనం అవుతారని, తన బ్రతికుండగానే అది చూడాలని కోరుకుంటున్నానని శాపనార్థాలు పెట్టారు చంటి. ఒకరి చెడును కోరుకోవద్దు అని చెప్పేవారితో తాను ఏకీభవించనని, తన చెడును కోరిన వారు నాశనం కావాలని స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో తాను గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తూ, తన ఈగో అడ్డువచ్చిందని కొందరు ప్రచారం చేస్తున్నారని చంటి తెలిపారు. కేవలం తలుపు తీయగానే వంగి వంగి దండాలు పెట్టకపోతే అది అహంకారంగా భావించడం ఇండస్ట్రీలో ఉందని అన్నారు. ఒక కో-డైరెక్టర్ లేదా టీమ్ లోని ఒక వ్యక్తికి తాను నచ్చకపోవడం వల్ల కూడా అవకాశాలు పోవచ్చని వివరించారు. భజన సంస్కృతిని తీవ్రంగా విమర్శించిన ఆయన, “నువ్వు ఎన్ని లంగా లఫూటి పనులు చేసినా, భజన కొట్టినంత సేపు నువ్వు గ్రేట్. మంచి పని చేసినా అది నచ్చకపోతే నువ్వు గలీజు గాడివి” అని అన్నారు. “మీ వల్లే నా పుట్టుక. నా జీవితం మీ వల్లే నడుస్తుంది. నేను నేల, మీరు నన్ను వజ్రంగా తయారుచేయాలి” అన్నట్లుగా నటిస్తేనే అవకాశాలు లభిస్తాయని ఆయన వెల్లడించారు. టాలెంట్ కన్నా వినయం, భజనకే ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుండి ఎలాంటి సహాయం అందలేదని, డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడని, లేకపోతే చనిపోవాల్సిందేనని చంటి అన్నారు. ఇది కలియుగ పాలసీ అని, డబ్బులు లేనప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని నమ్మడం పచ్చి అబద్ధం అని అన్నారు. “నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా, రోజూ దానికి చికెన్ మటన్ పెడితేనే అది నిన్ను పట్టించుకుంటుంది. రెండు నెలలు పెట్టకపోతే అది నిన్ను కరుస్తుంది” అనే ఉదాహరణతో మనుషుల స్వార్థాన్ని ఆయన వివరించాడు చంటి. మనుషులు అతిగా ఆశలు పెట్టుకోవడం, ప్రేమించడం తనదే తప్పు అని అన్నాడు చంటి. ఆర్టిస్ట్ జీవితం “గాజు బొమ్మ” లాంటిదని, ఎంత అందంగా కనబడినా, దాని వెనుక ఉన్న కష్టాలు ఎవరికీ తెలియవని చంటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
