AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haiku Movie Review: హైకూ మూవీ రివ్యూ.. ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి తమిళంలో హిట్ కొట్టారా..?

కోర్ట్ ఫేమ్ శ్రీదేవి ప్రధాన పాత్రలో ఏగన్, ఫెమినా జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో యువరాజ్ చినసామి తెరకెక్కించిన చిత్రం ‘హైకూ’. అరుళానందన్, మాథ్యూ అరుళానందన్ నిర్మించిన ఈ చిత్రానికి సిద్దు కుమార్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Haiku Movie Review: హైకూ మూవీ రివ్యూ.. ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి తమిళంలో హిట్ కొట్టారా..?
Haiku Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 23, 2026 | 11:28 AM

Share

మూవీ రివ్యూ: హైకూ

నటీనటులు: శ్రీదేవి, ఏగెన్‌, ఫెమినా జార్జ్‌, మైమ్ గోపీ తదితరులు

ఎడిటింగ్: శక్తి ప్రణేష్

సినిమాటోగ్రఫీ: పియూష్ గురుస్వామి

సంగీతం: సిద్దు కుమార్

నిర్మాతలు: అరుళానందన్, మ్యాథ్యూ అరుళానందన్

దర్శకుడు: యువరాజ్ చినసామి

కథ:

మనోహర్ (ఏగన్) మిడిల్ క్లాస్ కుర్రాడు. అతడు చేరిన కళాశాలలో దాదాపు అంతా అమ్మాయిలే ఉంటారు. వాళ్ల చేతుల్లో ర్యాగింగ్ పేరుతో ఆటపట్టించబడుతున్న క్రమంలో కొడి (శ్రీదేవి)తో స్నేహం చిగురిస్తుంది. ఆ తర్వాత అది కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే ఆమె ఇంట్లో కులమతాలు, హోదా పట్టింపులు ఎక్కువ. అయినా సరే అతడినే పెళ్లాడాలని ఆమె గట్టిగా నిర్ణయించుకుంటుంది. చదువయ్యాక ఉద్యోగ వేటలో భాగంగా హీరో చెన్నైకి వెళ్తాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్థల వల్ల దూరం పెరుగుతుంది. ఆమె మరొకరిని వివాహం చేసుకుని వెళ్లిపోతుంది. గతం తాలూకు బాధలోనే బతుకుతున్న హీరోకు ఎట్టకేలకు ఒక సంస్థలో జాబ్ దొరుకుతుంది. ఆఫీస్‌లో పరిచయమైన నివేదాతో (ఫెమినా జార్జ్) మళ్లీ ప్రేమలో పడతాడు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఈ బంధం కూడా ముగింపు దశకు చేరుకుంటుంది. తొలి ప్రేమ, మలిప్రేమ ఫెయిల్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమిటి? చివరకు సెకండ్ అమ్మాయితో అయినా మనోహర్ కలిశాడా లేదా? అనేదే ఈ చిత్ర కథ..

కథనం:

ఒక అమ్మాయితో ప్రేమ, బ్రేకప్.. ఆ తర్వాత ఆ పాత జ్ఞాపకాలను మర్చిపోలేక సతమతమవుతూనే ఇంకో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించడం అనే పాయింట్ చుట్టూ డైరెక్టర్ యువరాజ్ చిన్నసామి ఈ చిత్రాన్ని మలిచారు. ఎంచుకున్న థీమ్ బాగున్నప్పటికీ, తెరపై ప్రదర్శించిన తీరు మాత్రం కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. ప్రథమార్ధంలో హీరో కాలేజ్ లైఫ్, అక్కడ అతడు ఎదుర్కొనే ఫన్నీ ఇన్సిడెంట్స్, హీరోయిన్ ఎంట్రీ, వాళ్ల మధ్య ప్రేమ చిగురించడం వంటి ఎపిసోడ్స్ సరదాగా సాగిపోతాయి. కాలేజీ వాతావరణం ఆడియన్స్‌ను కొంతవరకు నవ్విస్తుంది. ఆ తర్వాత అపార్థాలతో మొదలయ్యే గొడవలు, చివరకు హీరోయిన్ వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇదంతా మనం రెగ్యులర్‌గా చూసే రొటీన్ ఫార్ములానే. ఇక సెకండాఫ్‌లో హీరో తన కెరీర్‌పై ఫోకస్ చేయడం, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం వంటి అంశాలతో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అయితే రెండో లవ్ స్టోరీ మొదలైన తర్వాత ఫస్టాఫ్ సీన్లే మళ్లీ రిపీట్ అవుతున్నాయా అనే ఫీలింగ్ కలుగుతుంది. పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త బంధంలోకి అడుగుపెట్టే క్రమంలో హీరో పడే మానసిక సంఘర్షణను దర్శకుడు ఎమోషనల్‌గా బాగానే రాసుకున్నారు. కానీ రొమాంటిక్ ట్రాక్‌లో బలంగా ఉండాల్సిన డెప్త్ మిస్ అవ్వడం కాస్త నిరాశపరుస్తుంది. ముగింపు సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. ఓవరాల్‌గా ఇదొక కొత్త తరహా పాయింట్ కాకపోయినా, కొన్ని సీన్ల పరంగా డైరెక్టర్ పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అంతర్లీనంగా కులాల కుమ్ములాటలపై ఇచ్చిన చిన్న మెసేజ్ కూడా ఆలోచింపజేస్తుంది.

నటీనటులు:

బ్రేకప్ బాధను అనుభవించే కుర్రాడి క్యారెక్టర్‌లో ఏగన్ ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించాడు. ఇక తెలుగమ్మాయి శ్రీదేవికి మంచి రోల్ దక్కింది. తన పరిధి మేర ఎలాంటి అతి లేకుండా చాలా సహజంగా నటించి మెప్పించింది. ద్వితీయార్థంలో కీలకమైన నివి పాత్రలో ఫెమినా జార్జ్ తన క్యూట్ లుక్స్‌తో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సినిమాలోని మెయిన్ డ్రామా అంతా ఈమె చుట్టూనే నడుస్తుంది. ఈ ముగ్గురే ఈ ప్రాజెక్ట్‌ను తమ భుజాలపై వేసుకుని నడిపించారు. మిగతా ఆర్టిస్టులు తమ క్యారెక్టర్ల మేరకు బాగానే సపోర్ట్ చేశారు.

టెక్నికల్ టీం:

మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధు కుమార్ అందించిన బాణీలు ఈ ప్రేమకథకు ప్రధాన బలం. ఇందులోని మూడు సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. పియూష్ గురుస్వామి కెమెరా పనితనం విజువల్స్‌ను రిచ్‌గా చూపించింది. ఎడిటింగ్ విభాగం సెకండాఫ్ ట్రిమ్మింగ్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాతలు అరుళానందన్, మ్యాథ్యూ అరుళానందన్ ఖర్చుకు వెనుకాడలేదని ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలుస్తోంది. పాత స్టోరీనే అయినా యువతీయువకుల నటన సినిమాను కాస్త సేవ్ చేసింది. ఈతరం ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ విలువలు కూడా ఇందులో బాగానే ఉన్నాయి. అయితే డబ్బింగ్ సినిమా కావడం ఒక్కటే దీనికి మైనస్.. మన దగ్గర దీనికి ఎంత కనెక్ట్ అవుతారనేది చూడాలి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా హైకూ.. రియలిస్టిక్ ఎంగేజింగ్ లవ్ స్టోరీ..!

Follow Us