Cricket: 10 ఫోర్లు, 6 సిక్సర్లు.. 16 బంతుల్లో బౌలర్ల ఊచకోత.. సెంచరీతో కోహ్లీ టీమ్‌మేట్ విధ్వంసం!
49 బంతుల్లో అదిరిపోయే సెంచరీ చేసి.. ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుకు సారధ్యం..
మహారాజా టీ20 ట్రోఫీలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లేయర్ మయాంక్ అగర్వాల్ విధ్వంసం సృష్టించాడు. 49 బంతుల్లో అదిరిపోయే సెంచరీ చేసి.. ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న మయాంక్ అగర్వాల్.. ఇటీవల శివమొగ్గ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన టీంను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదు చేసింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్ జట్టు.. నిర్ణీత 19 ఓవర్లకు(వర్షం కారణంగా కుదింపు) 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహన్ కదమ్(84), శరత్(51) అర్ధ సెంచరీలు చేయడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. బెంగళూరు బ్లాస్టర్స్ బౌలర్లలో సుచిత్, కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇక భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన బెంగళూరు బ్లాస్టర్స్‌కు.. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్(102) అదిరిపోయే సెంచరీతో ఆకట్టుకున్నాడు. 49 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాకుండా తన జట్టు అద్భుత విజయాన్ని అందించాడు. కాగా, ఈ విజయంతో బెంగళూరు బ్లాస్టర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.