AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందే కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?

KKR IPL 2026 injury blow: ఓ పక్క టీ20 ప్రపంచకప్ 2026 జరుగుతుంటే.. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నీ నిశితంగా చూస్తున్నాయి. ఎందుకంటే, తమ జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శనతోపాటు గాయాల బారిన పడే అవకాశాలను పరిశీలిస్తున్నారు. తాజాగా కేకేఆర్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

IPL 2026: ఐపీఎల్ 2026కు ముందే కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
Ipl 2026 Kkr
Venkata Chari
|

Updated on: Feb 17, 2026 | 10:02 AM

Share

KKR IPL 2026 injury blow: ఐపీఎల్ 2026 (IPL 2026) ప్రారంభానికి ఇంకా సుమారు నెలన్నర సమయం ఉంది. ప్రస్తుతం ఆటగాళ్లంతా టీ20 ప్రపంచకప్ 2026లో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కొనుగోలు చేసిన ఓ ప్లేయర్ గాయంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో కేకేఆర్ టీం ఆందోళనలో పడింది. శ్రీలంక ప్లేయర్ మతీష పతిరానా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో గాయపడి మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ గాయంతో శ్రీలంక జట్టు మాత్రమే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతోందన్నమాట.

ఈ ఊహించని సంఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చోటుచేసుకుంది. ఓవర్లో నాలుగో బంతిని వేసిన వెంటనే పతిరానా ఎడమ కాలి హామ్‌స్ట్రింగ్‌ను పట్టుకుని నొప్పితో నేలపై పడిపోయాడు. వెంటనే జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. కొంతసేపటి తర్వాత రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించుకుని పతిరానాను మైదానం బయటకు తీసుకెళ్లారు.

ఐపీఎల్ 2026కి ముందే పతిరానాకు గాయంతో కేకేఆర్ కి టెన్షన్..

పతిరానాకు దీర్ఘకాలిక గాయం అయితే, కేకేఆర్ తమ రెండు ప్రధాన విదేశీ బౌలర్లను కోల్పోయినట్లే అవుతుంది. ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ముస్తాఫిజూర్ రెహమాన్‌ను ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఇప్పుడు పతిరానా గాయం కేకేఆర్ కు మరింత ఇబ్బందికరంగా మారనుంది.

గాయాలకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న పతిరానా, శ్రీలంకకు టీ20 వరల్డ్ కప్ సూపర్-8 అర్హత కీలకమైన సమయంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కానీ తన స్పెల్‌లో నాలుగు బంతులు మాత్రమే వేసిన వెంటనే గాయపడి బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇది శ్రీలంక జట్టుకు రెండో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా కూడా ఇదే హామ్‌స్ట్రింగ్ గాయంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. పతిరానా దీర్ఘకాలం దూరమైతే కేకేఆర్ వద్ద విదేశీ పేసర్ ఎవరూ లేకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది.

కేకేఆర్ పై ఈ గాయం ప్రభావం ఎలా ఉంటుంది?

కేకేఆర్ వద్ద భారత పేసర్లకు కొదవ లేదు. కానీ, విదేశీ బౌలర్ల విషయంలో ముస్తాఫిజూర్, పతిరానా మాత్రమే ప్రధాన ఎంపికలుగా ఉన్నారు. కాగితాల మీద చూస్తే ఈ ఇద్దరి చేరికతో కేకేఆర్ బౌలింగ్ బలంగా కనిపించింది. కానీ, వాస్తవ పరిస్థితి ఇప్పుడు భిన్నంగా మారింది.

ముస్తాఫిజూర్‌ను ఇప్పటికే విడుదల చేయాల్సి రావడంతో, పతిరానానే కేకేఆర్ కు ఏకైక విదేశీ పేసర్‌గా మిగిలాడు. ఇప్పుడు అతడూ గాయపడటం వల్ల ఐపీఎల్ 2026 కోసం కేకేఆర్ ప్రణాళికలు పూర్తిగా తారుమారయ్యే ప్రమాదం ఉంది.

శ్రీలంకకు కూడా పతిరానా భారీ నష్టమే?

శ్రీలంక జట్టుకు మంచి స్పిన్ బౌలర్లు ఉన్నప్పటికీ, వేగంగా వికెట్లు పడగొట్టే పేసర్ మాత్రం కొరతగా ఉంది. ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆ బాధ్యత పతిరానాపైనే ఉంది. అతడు మధ్య ఓవర్లలో, డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీయగలడు. ప్రపంచంలోని ఉత్తమ డెత్ బౌలర్లలో ఒకడిగా పతిరానాకు పేరు ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పతిరానా లేకపోవడం వెంటనే కనిపించింది. తొలి 10 ఓవర్లలో శ్రీలంక ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. పతిరానా లేకపోవడంతో మిగతా బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లకు సులభ లక్ష్యాలుగా మారారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us