AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Schools Reopen: రెండు నెలల తర్వాత స్కూళ్లలో సందడి.. విద్యార్థులకు కీలక అప్డేట్!

వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత కారణంగా జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సిన బడులను జూన్ 15కు వాయిదా వేశారు. కొత్త విద్యాసంవత్సరానికి పాఠశాలలను పూర్తిగా సిద్ధం చేయగా, రెండు నెలలుగా వెలవెలబోయిన స్కూళ్లు విద్యార్థులతో సందడిగా మారనున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉండనున్నాయి. దసరా, క్రిస్మస్‌, సంక్రాంతి సెలవుల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ ఖరారు చేసింది. 2027 ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా, ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి..

Schools Reopen: రెండు నెలల తర్వాత స్కూళ్లలో సందడి.. విద్యార్థులకు కీలక అప్డేట్!
TG Schools Reopen from today
Srilakshmi C
|

Updated on: Jun 14, 2026 | 11:19 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 14: సుదీర్ఘ వేసవి సెలవుల విరామం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (జూన్‌ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలలుగా విద్యార్థుల సందడి లేక వెలవెలబోయిన స్కూళ్లు మళ్లీ చిన్నారుల కేరింతలతో కళకళలాడనున్నాయి. కొత్త విద్యాసంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాఠశాలల ఆవరణలను శుభ్రపరచడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి 2026-27 విద్యాసంవత్సరం జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 15కు వాయిదా వేసింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

పాఠశాలల ప్రారంభం వాయిదా పడటంతో కోల్పోయిన పనిదినాలను భర్తీ చేసేందుకు జూలై 11వ తేదీని, రెండో శనివారమైనప్పటికీ, పనిదినంగా పరిగణించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేసేందుకు నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. మొదటి మూల్యాంకనం జూలై 31 నాటికి, రెండోది సెప్టెంబర్ 21 నాటికి, మూడోది డిసెంబర్ 10 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

సెలవుల విషయానికి వస్తే.. విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. అలాగే 2027 జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 2026-27 విద్యాసంవత్సరానికి ఏప్రిల్ 23ను చివరి పనిదినంగా నిర్ణయించగా, 2027 ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Follow Us