Ind Vs Pak : పాకిస్థాన్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ వివాదం.. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సంచలన కామెంట్స్
Ind Vs Pak : మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు షేక్‌హ్యాండ్ వివాదంపై టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. తాము కేవలం క్రికెట్‌పైనే దృష్టి పెట్టామని స్పష్టం చేసిన హర్మన్, పాక్‌తో పోరుకు జట్టు సిద్ధంగా ఉందని వెల్లడించింది.

Ind Vs Pak : క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే భారత్, పాకిస్థాన్ మహాసంగ్రామానికి మళ్లీ సమయం ఆసన్నమైంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం సాయంత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, సాంప్రదాయ ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టుకు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. సాధారణంగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే మైదానంలో ఆటే కాదు, మైదానం వెలుపల కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, వివాదాలు తెరపైకి వస్తుంటాయి.
మళ్లీ తెరపైకి వచ్చిన షేక్‌హ్యాండ్ వివాదం
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా వేదికగా ఒక పాత వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, గత ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పురుషుల, మహిళల జట్లు పాక్ ఆటగాళ్లతో చేతులు కలపడం లేదు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అండర్-19 వరల్డ్ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లలో కూడా భారత ఆటగాళ్లు కొనసాగించారు. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే పంథా కొనసాగుతుందా అనే ప్రశ్న తలెత్తింది.
వివాదాలపై హర్మన్‌ప్రీత్ కౌర్ గట్టి కౌంటర్
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేఖరులు ఈ షేక్‌హ్యాండ్ వివాదం గురించి, అలాగే దీనిపై బీసీసీఐ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని హర్మన్‌ప్రీత్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై భారత కెప్టెన్ చాలా చాకచక్యంగా, గట్టిగా స్పందించారు. “మేము ఇక్కడికి వచ్చింది కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే. మేము ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడతాం, క్రికెట్ గురించే ఆలోచిస్తాం. అంతకు మించి వేరే ఏ విషయాలనూ నేను పట్టించుకోను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటమే మా కల, రేపటి మ్యాచ్‌ను కూడా మేము ఒక సాధారణ అంతర్జాతీయ మ్యాచ్‌లాగే భావిస్తున్నాం” అని హర్మన్‌ప్రీత్ కౌర్ స్పష్టం చేశారు.
పాక్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లలో ఉండే మానసిక ఒత్తిడి గురించి హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. “నేను క్రికెట్ చూడటం ప్రారంభించినప్పటి నుంచి ఒక అభిమానిగా ఆ ఒత్తిడిని అనుభవించాను. ఇప్పుడు స్వయంగా మైదానంలో ఆడుతున్నప్పుడు ఆ ప్రెజర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే అంతర్జాతీయ మ్యాచ్ అన్నప్పుడు ఒత్తిడి సహజం. ఆ ఒత్తిడిని జయించి, మైదానంలో 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే మా లక్ష్యం. ఇంతటి గొప్ప వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒత్తిడిని పక్కనబెట్టి మ్యాచ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తాం” అని ఆమె పేర్కొన్నారు.
ట్రాక్ రికార్డులో టీమిండియాదే హవా
ఈ టోర్నీలో గ్రూప్-A లో ఉన్న భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం. అయితే పాకిస్థాన్‌పై భారత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 16 టీ20 మ్యాచ్‌లలో భారత్ 13 సార్లు విజయం సాధించగా, పాక్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. అలాగే మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఆడిన 8 మ్యాచ్‌లలో భారత్ 6-2 ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత ఫామ్, గణాంకాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
