AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suyash Sharma: ఎవరీ సుయాష్ శర్మ.? గల్లీ టూ ఐపీఎల్.. అరంగేట్ర మ్యాచ్‌లో కోహ్లీ జట్టునే బెదరగొట్టాడు..

ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది..

Suyash Sharma: ఎవరీ సుయాష్ శర్మ.? గల్లీ టూ ఐపీఎల్.. అరంగేట్ర మ్యాచ్‌లో కోహ్లీ జట్టునే బెదరగొట్టాడు..
Suyash Sharma
Ravi Kiran
|

Updated on: Apr 07, 2023 | 11:49 AM

Share

సుయాష్ శర్మ.. సుయాష్ శర్మ.. సుయాష్ శర్మ.. నిన్నటి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తర్వాత ఈ పేరు మారుమ్రోగుతోంది. ఎవరీ మిస్టరీ స్పిన్నర్. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి.. తన స్పిన్ బౌలింగ్‌తో కోహ్లీ టీంను భయపెట్టేశాడు ఈ 19 ఏళ్ల కోల్‌కతా బౌలర్. గతంలో ఫస్ట్ క్లాస్, లిస్టు-ఏ, టీ20 మ్యాచ్‌లు ఏవి కూడా ఆడలేదు. గల్లీ నుంచి ఏకంగా ఐపీఎల్‌కు.. కట్ చేస్తే.. అరంగేట్రం మ్యాచ్‌లో దుమ్ములేపే పెర్ఫార్మన్స్‌తో దమ్ము చూపించాడు సుయాష్ శర్మ.

గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. తమ హోం గ్రౌండ్‌లో ఆర్సీబీని 81 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్ 89 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ (68), రింకు సింగ్ (46) తుఫాన్ ఇన్నింగ్స్‌‌లతో చెలరేగి.. తమ జట్టుకు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ అందించారు.

ఇక 205 పరుగుల భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టును కేకేఅర్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, సునీల్ నరైన్ బెదరగొట్టారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా.. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన 19 ఏళ్ల సుయాష్ శర్మ.. మూడు వికెట్లు తీశాడు. ఇక నరైన్ 2 వికెట్లు, శార్దూల్ ఒక్క వికెట్‌తో వీరికి సహాయపడ్డారు. ఇదిలా ఉండగా.. మొదటి మ్యాచ్‌లోనే అందరిని ఆకట్టుకున్నాడు సుయాష్ శర్మ. మాజీ క్రికెటర్లు సైతం అతడి ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో ఢిల్లీ కుర్రాడు సుయాష్ శర్మను రూ. 20 లక్షలకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. నిన్నటి మ్యాచ్‌లో RCB బ్యాటర్లను ఎదుర్కునేందుకు కేకేఆర్.. ఇంపాక్ట్ ప్లేయర్ స్థానంలో ఉన్న అతడ్ని.. బౌలర్‌గా బరిలోకి దింపింది. ఇప్పటిదాకా లిస్టు-ఏ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లు ఏవి కూడా సుయాష్ శర్మ ఆడలేదు. కేవలం అండర్-25 జట్టుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు.

కాగా, మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా మాట్లాడుతూ.. ‘సుయాష్‌కు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ. తనకొచ్చే అవకాశాలను అతడు కౌంట్ చేసుకుని.. బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. జట్టుకు అతడిపై పూర్తి నమ్మకం ఉంది’ అని చెప్పాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..