Kadapa Boy : దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన కడప జిల్లా యువకుడు
Kadapa Boy : దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టులో కడప జిల్లాకు చెందిన యువకుడు స్థానం సంపాదించాడు. నందలూరుకు

Kadapa Boy : దివ్యాంగుల జాతీయ క్రికెట్ జట్టులో కడప జిల్లాకు చెందిన యువకుడు స్థానం సంపాదించాడు. నందలూరుకు చెందిన ఆలుసూరి శివకోటికి చోటు దక్కింది. బోర్డు ఆఫ్ డిసేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. మూడు ఫార్మాట్లలో ఒక టెస్టు మ్యాచ్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడేందుకు శివకోటి ఎంపికయ్యాడు.
ఈనెల 3 నుంచి 8 వరకు హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఇండియన్ డిసేబుల్ ప్రాబబుల్స్ క్యాంప్‌లో ఎంపిక నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుంచి 35 మంది క్రీడాకారులు జట్టులో స్థానం పొందేందుకు పోటీపడ్డారు. అయితే శివకోటి అద్భుతమైన క్రికెట్ ఆడి అధికారులను ఆకర్షించాడు. దీంతో అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేశారు.
సెప్టెంబర్‌లో జరిగే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సీరిస్‌లో శివకోటి పాల్గొంటాడు. ఈ సందర్భంగా శివకోటి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా సిరీస్‌లో మంచి క్రికెట్ ఆడి జట్టు విజయానికి తోడ్పడుతానని పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు ఎంపికైనందుకు శివకోటిని పలువురు క్రీడాకారులు, స్థానికులు అభినందించారు.



