AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL History : కెప్టెన్‌గా మారిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ కప్పు.. ఈ నలుగురు వీరుల రికార్డు మామూలుది కాదు

IPL History : ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే కప్పు గెలిచిన నలుగురు ప్లేయర్లు వీరే. షేన్ వార్న్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రజత్ పాటిదార్‌ల రికార్డుల వివరాలు తెలుసుకుందాం. రోహిత్ హవా 2013 నుంచి ముంబైకి ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించే వరకు కొనసాగింది.

IPL History : కెప్టెన్‌గా మారిన తొలి సీజన్‌లోనే ఐపీఎల్ కప్పు.. ఈ నలుగురు వీరుల రికార్డు మామూలుది కాదు
Rohit Sharma
Rakesh
|

Updated on: Mar 23, 2026 | 5:53 PM

Share

IPL History : ఐపీఎల్ (IPL) చరిత్రలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే కప్పు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లు ఏళ్ల తరబడి శ్రమించినా దక్కని ఈ అరుదైన గౌరవం, కేవలం నలుగురు వీరులకు మాత్రమే దక్కింది. 18 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానంలో తమ కెప్టెన్సీ మార్క్‌ను మొదటి సీజన్‌లోనే చూపించి, జట్టుకు ట్రోఫీని అందించిన ఆ నలుగురు కెప్టెన్ల గురించివివరంగా తెలుసుకుందాం. విశేషమేమిటంటే, ఈ నలుగురిలో ముగ్గురు మన భారతీయులే కావడం మనకు గర్వకారణం.

1. షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్ – 2008)

ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి సీజన్‌లోనే కెప్టెన్‌గా కప్పు కొట్టిన ఘనత దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్‌కు దక్కుతుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ జట్టులో పెద్ద స్టార్ ప్లేయర్లు లేకపోయినా, షేన్ వార్న్ తన అద్భుతమైన నాయకత్వ పటిమతో యువ ఆటగాళ్లను ముందుకు నడిపించాడు. ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి, రాజస్థాన్ రాయల్స్‌ను ఐపీఎల్ చరిత్రలో తొలి ఛాంపియన్‌గా నిలిపాడు. ఓ అనామక జట్టును విజేతగా నిలిపి కెప్టెన్సీ అంటే ఇలా ఉండాలి అని ప్రపంచానికి చాటిచెప్పాడు.

2. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్ – 2013)

ముంబై ఇండియన్స్ అప్పటికే ఎంతో మంది దిగ్గజ కెప్టెన్ల కింద ఆడింది కానీ కప్పు మాత్రం దక్కలేదు. అయితే 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ శర్మ, ఆ ఏడాది ముంబైకి తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి సీజన్‌లోనే ట్రోఫీని గెలవడం ద్వారా రోహిత్ తన సత్తా చాటాడు. అప్పటి నుంచి మొదలైన రోహిత్ హవా.. ముంబైకి ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించే వరకు కొనసాగింది. ముంబై ఫ్రాంచైజీ తలరాతను మార్చిన కెప్టెన్‌గా రోహిత్ చరిత్రలో నిలిచిపోయాడు.

3. హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్ – 2022)

2022 ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యా కెరీర్‌లో ఒక మైలురాయి. కొత్తగా ఏర్పడిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అసలు హార్దిక్ కెప్టెన్సీ చేయగలడా అని సందేహించిన వారికి తన ఆటతో, ఆలోచనలతో సమాధానం చెప్పాడు. జట్టును సమర్థవంతంగా నడిపిస్తూ, తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్‌లోకి కొత్తగా వచ్చిన ఒక జట్టు, ఒక కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో టైటిల్ గెలవడం ఒక అద్భుతం అనే చెప్పాలి. ఈ విజయంతో హార్దిక్ తనలోని నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి చాటాడు.

4. రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 2025)

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన విజయం ఏదైనా ఉందంటే అది 2025లో ఆర్సీబీ (RCB) సాధించిన విజయమే. విరాట్ కోహ్లీ వంటి మహామహులు ఎన్నో ఏళ్లుగా శ్రమించినా దక్కని ట్రోఫీని, కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిలోనే రజత్ పాటిదార్ సాధించి పెట్టాడు. యువ ఆటగాడైన పాటిదార్‌పై నమ్మకంతో ఆర్సీబీ యాజమాన్యం కెప్టెన్సీ అప్పగించగా, ఆ నమ్మకాన్ని వంద శాతం నిలబెట్టుకున్నాడు. 2025 సీజన్‌లో జట్టును అద్భుతంగా నడిపిస్తూ బెంగళూరు అభిమానుల 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆర్సీబీ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగ్గ కెప్టెన్‌గా పాటిదార్ నిలిచిపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us