హైదరాబాద్–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!
హైదరాబాద్–విజయవాడ మధ్య కీలకమైన ఎన్‌హెచ్–65ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సుమారు రూ.6,792 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను 2027 జనవరిలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధితో పాటు 17 ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణం సులభమయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలక రవాణా మార్గమైన ఎన్‌హెచ్–65 విస్తరణకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ హైవేను ఆరు వరుసలుగా అభివృద్ధి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2027 జనవరిలో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ విస్తరణతో ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇప్పుడు డిటైయిల్ గా చూద్దాం. హైదరాబాద్–విజయవాడ హైవే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన రహదారి. హైదరాబాద్ నుంచి చౌటుప్పల్, నల్గొండ, సూర్యాపేట మీదుగా విజయవాడకు చేరుకోవాలంటే ఈ మార్గమే ప్రధాన ఆధారం. నిత్యం వేలాది కార్లు, బస్సులు, లారీలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రస్తుత నాలుగు వరుసల రహదారిపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, జంక్షన్ల వద్ద రద్దీ ప్రయాణికులకు సమస్యగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో హైవేను ఆరు వరుసలుగా విస్తరించాలనే ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ విస్తరణకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో ఎన్హెచ్ఏఐ ఛైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్, ఉన్నతాధికారులతో చర్చించారు. టెండర్ల ప్రక్రియను నవంబరు 11లోగా పూర్తి చేయగలిగితే.. 2027 జనవరిలో పనులు ప్రారంభించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. సుమారు 270 నుంచి 275 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మార్గంలో ఆరు వరుసల నిర్మాణంతోపాటు ఇరువైపులా సర్వీసు రోడ్ల అభివృద్ధిపైనా దృష్టి సారిస్తున్నారు. దీనివల్ల ప్రధాన హైవేపై స్థానిక వాహనాల రాకపోకలు, దూరప్రాంతాలకు వెళ్లే వాహనాల ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది. అయితే.. హైవే విస్తరణ అంటే కేవలం రోడ్డు వెడల్పు పెంచడమే కాదు. ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ పోలీసుల వివరాల ప్రకారం.. 2025 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య ఎన్‌హెచ్–65 పరిధిలోని ఆరు జిల్లాల్లో వెయ్యి 661 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 354 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 580 ప్రమాదాలు నమోదయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రధాన కారణాలుగా గుర్తించారు. ఈ గణాంకాలు హైవేపై భద్రతా చర్యలు ఎంత అవసరమో స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైవేపై 17 ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. చౌటుప్పల్, పెద్దకాపర్తి, చిట్యాల, కట్టంగూర్, ఇనుపాముల, టేకుమట్ల, దురాజ్‌పల్లి జంక్షన్ సహా పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వాహనాలు ఒకవైపు నుంచి మరోవైపునకు సురక్షితంగా వెళ్లేందుకు అండర్‌పాస్‌లు, రద్దీ ఎక్కువగా ఉండే చోట జంక్షన్ల అభివృద్ధి, అవసరమైన ప్రాంతాల్లో సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే పెద్దకాపర్తి అండర్‌పాస్ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి సదుపాయాలు మెరుగుపడితే ప్రమాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 39.85వ కిలోమీటరు నుంచి 221.15వ కిలోమీటరు వరకు 181.30 కిలోమీటర్ల విస్తరణ పనులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రతిపాదించారు. దీని అంచనా విలువ సుమారు రూ.6,792.52 కోట్లు. ఆరు ప్రధాన వరుసలతోపాటు సర్వీసు రోడ్లు, మెరుగైన జంక్షన్లు, అండర్‌పాస్‌లు, అవసరమైన చోట నియంత్రిత ప్రవేశ సదుపాయాలు ఈ ప్రాజెక్టులో కీలకం కానున్నాయి. అయితే పనుల ప్రారంభం, పూర్తి కావడానికి సంబంధించిన తుది గడువులు అధికారిక ప్రక్రియపై ఆధారపడి ఉంటాయి. మొత్తానికి.. హైదరాబాద్–విజయవాడ హైవే ఆరు వరుసలుగా మారితే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడంతోపాటు ప్రయాణ సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. సరకు రవాణా వాహనాలకూ మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. అదే సమయంలో బ్లాక్స్పాట్ల సవరణ, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయితే ప్రమాదాల నివారణకు కూడా తోడ్పడతాయి. మరి ఈ విస్తరణ పనులు అనుకున్న సమయానికి ప్రారంభమై.. ప్రయాణికులకు ఊరటనిస్తాయా? అనేది చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో షాకింగ్ ఘటన.. ఫ్లైట్ అటెండెంట్‌ను కొరికిన నటి
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..
అరె.. ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది.. మోకు లేకుండానే చకచకా చెట్టెక్కేసాడు!
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం.. పరిశోధనలో షాకింగ్ విషయాలు!
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..
ఉపాధ్యాయుడి వింత చేష్టలు.. విద్యార్ధి తలపై ఏం చేశాడో చూడండి!

