AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం.. కేరళకు చెందిన ముగ్గురు మృతి

విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించి, కుటుంబాలకు అండగా నిలవాలనుకున్నారు. ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశపడ్డారు. అందుకోసం సొంతూరిని, కుటుంబ సభ్యులను వదిలి జర్మనీ వెళ్లారు. కానీ విధి వారిని వెంటాడింది. జర్మనీలోని బొఖుమ్ నగరంలో ఓ నివాస భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ముగ్గురు భారతీయుల ప్రాణాలను బలిగొంది. ఘటనకు సంబంధించి 41 ఏళ్ల రొమేనియా దేశస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను కేరళకు చెందిన అంజలి ఎస్. జాయ్, నోవా సాబు, సివిన్ జానీగా గుర్తించారు.

జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం.. కేరళకు చెందిన ముగ్గురు మృతి
Three From Kerala Who Went To Germany Die In Fire
Sharada V
|

Updated on: Oct 15, 2026 | 9:49 PM

Share

అగ్నిమాపక సిబ్బంది రెండో అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. వారిలో కేరళకు చెందిన ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి సాంకేతిక లోపం కారణం కాదని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్దేశపూర్వకంగానే మంటలు పెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. భవనంలోని చెక్క మెట్ల ద్వారా మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. ఆ మెట్లే భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావడంతో అక్కడి నివాసితులు తప్పించుకోవడం కష్టంగా మారింది. అదే సమయంలో దట్టమైన పొగ కారిడార్లను కమ్మేసింది.అగ్నిప్రమాదానికి ముందు రోజు భవనంలో నివసిస్తున్న వారి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టీచర్ కావాలనుకున్న అంజలి.. ఉద్యోగం కోసం జర్మనీకి

కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన అంజలి ఎస్. జాయ్‌కు చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే కోరిక ఉండేది. బీఈడీ పూర్తి చేసిన ఆమె.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక పరీక్షలు రాసింది. ఇతర పోటీ పరీక్షల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో ప్రైవేట్ ట్యూషన్ కేంద్రాల్లో బోధిస్తూ .. చివరకు మెరుగైన ఉపాధి కోసం ఈ ఏడాది జులైలో జర్మనీ వెళ్లింది.

అంజలి ప్రతిరోజూ తన తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేది. ప్రమాదానికి ముందు సోమవారం రాత్రి కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడింది. అయితే మంగళవారం రాత్రి ఆమె నుంచి ఫోన్ రాకపోవడంతో తండ్రి జాయ్ ఆందోళన చెందారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. బొఖుమ్‌కు 50 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న ఓ బంధువుకు సమాచారం ఇచ్చారు. అతడు అక్కడికి వెళ్లి ఆరా తీయడంతో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగంలో చేరాల్సిన రోజే.. సివిన్ జీవితంలో విషాదం

కేరళలోని ఎర్నాకుళం జిల్లా యోర్దానాపురానికి చెందిన సివిన్ జానీ వయసు 25 ఏళ్లు.  కెరీర్, విదేశీ విద్యా కోర్సులకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశాడు. మెరుగైన ఉద్యోగం కోసం సెప్టెంబర్ 14న జర్మనీ వెళ్లాడు.  అక్టోబర్ 12, సోమవారం ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కొత్త ఉద్యోగంలో చేరి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి ముందు ఆదివారం రాత్రి సివిన్ తన తండ్రితో మాట్లాడాడు. సోమవారం ఉద్యోగంలో చేరనున్నట్లు, కొత్త నివాసానికి మారనున్నట్లు చెప్పాడు. అయితే తన పాస్‌పోర్టు, ఇతర ముఖ్యమైన పత్రాలను బొఖుమ్‌కు సుమారు రెండు గంటల దూరంలో నివసిస్తున్న తమ్ముడి వద్ద ఉంచాడు. దీంతో మృతదేహాన్ని గుర్తించడంలో కొంత ఆలస్యం జరిగింది. సివిన్ అక్క సిమి యూకేలో నర్సుగా పనిచేస్తోంది. వచ్చే ఏడాది మేలో ఆమె వివాహం జరగాల్సి ఉంది. ఆ వేడుకకు ఇద్దరు సోదరులు హాజరు కావాలని కుటుంబం ఆశించింది. కానీ అంతలోనే సివిన్ మరణవార్త ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

జిమ్ ట్రైనర్‌గా ఎదగాలనుకున్న నోవా సాబు

కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన నోవా సాబు కాలేజీ రోజుల్లో క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది. ఆ ఆసక్తితోనే జిమ్ ట్రైనర్‌గా కెరీర్‌ను ఎంచుకుంది. కొంతకాలం ఇడుక్కిలో పనిచేసిన ఆమె.. అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ కూడా పొందింది. ఈ రంగంలో మరింత ఎదగాలనే ఆశతో రెండున్నర నెలల క్రితమే జర్మనీ వెళ్లింది. బొఖుమ్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి జర్మనీలోని కేరళవాసులు బుధవారం నోవా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు

ప్రమాద సమయంలో నోవాతో పాటు మరికొందరు భవనంలోని పై అంతస్తులో నిద్రిస్తున్నట్లు సమాచారం. గదుల్లోకి పొగ వ్యాపించడంతో వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మృతులకు మంటల వల్ల కాలిన గాయాలు కాలేదు, పొగ పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోయారు.  మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం, జర్మనీలోని ప్రవాస కేరళ సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us