IPL 2026 : ఆర్సీబీ vs గుజరాత్ టైటాన్స్ .. అహ్మదాబాద్ పిచ్ నంబర్-6 వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. ?
IPL 2026 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య టైటిల్ పోరు జరగనుంది.

IPL 2026 : క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ (GT)ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా ఇప్పుడు అందరి దృష్టి అహ్మదాబాద్ స్టేడియంలోని పిచ్ నంబర్-6 పైనే పడింది. ఎందుకంటే ఈ పిచ్‌తో ఆర్సీబీకి, ముఖ్యంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఒక వింతైన, మరువలేని పాత కనెక్షన్ ఉంది. ఇక్కడ కోహ్లీకి గుండెకోత మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో పాటు, చరిత్ర సృష్టించిన తీపి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో కోహ్లీ తన పాత బ్యాడ్ లక్‌ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
టైటిల్ డిఫెండ్ చేసుకోబోతున్న బెంగళూరు
బెంగళూరు జట్టు వరుసగా రెండో ఐపీఎల్ సీజన్‌లోనూ అహ్మదాబాద్ మైదానంలోనే ఫైనల్ మ్యాచ్ ఆడటం విశేషం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదటిది, గత ఏడాది ఛాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ.. ఈసారి తన టైటిల్‌ను కాపాడుకోవాలనే భారీ ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. రెండోది, ఈసారి ఫైనల్లో వారి ప్రత్యర్థి సాధారణ జట్టు కాదు.. స్థానిక ప్రేక్షకుల మద్దతు ఉన్న గుజరాత్ టైటాన్స్ హోమ్ టీమ్. ఇటువంటి హోరాహోరీ పోరులో మ్యాచ్ జరగబోయే 6వ నంబర్ పిచ్ ఎలాంటి మలుపులు తిప్పబోతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ ఆటగాళ్లు మైదానంలో విపరీతంగా చెమటోడ్చారు.
బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఏమన్నాడంటే?
ఫైనల్ మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ పిచ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను పిచ్‌ను పూర్తిగా పరిశీలించగా దానిపై కొంత గడ్డి ఉందని తెలిపాడు. మ్యాచ్‌కు ఒకరోజు ముందే ఆ గడ్డిని కాస్త కట్ చేశారని, మ్యాచ్ సమయానికి మరికొంత ట్రిమ్ చేసే అవకాశం ఉందని అన్నాడు. ఏదేమైనప్పటికీ ఫైనల్ మ్యాచ్‌కు పిచ్ చాలా అద్భుతంగా సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు పాటిదార్ ధీమా వ్యక్తం చేశాడు.
వరల్డ్ కప్ ఫైనల్ చేదు జ్ఞాపకం
విరాట్ కోహ్లీకి ఈ పిచ్ నంబర్-6 ఒక పెద్ద సెంటిమెంట్‌గా మారింది. ఎందుకంటే, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య సరిగ్గా ఇదే 22 గజాల పట్టీపైనే జరిగింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా 239 పరుగులకే పరిమితమై వరల్డ్ కప్ చేజార్చుకుంది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడి 54 పరుగులు చేసినప్పటికీ.. బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి బ్యాట్‌కు తగిలి స్టంప్స్‌ను ఎగరేసింది. ఈ చేదు జ్ఞాపకం భారత అభిమానులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
ఈ సీజన్లోనూ అదే సీన్ రిపీట్
కేవలం వరల్డ్ కప్ మాత్రమే కాదు.. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో బెంగళూరు తలపడినప్పుడు కూడా ఇదే 6వ నంబర్ పిచ్‌ను ఉపయోగించారు. ఆ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేయడంతో కేవలం 155 పరుగులకే ఆలౌట్ అయి ఓడిపోయింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఆ మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ కేవలం 13 బంతుల్లోనే 28 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తూ వరల్డ్ కప్ ఫైనల్ తరహాలోనే ఒక షాట్ ఆడబోయి, బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకొని స్టంప్స్‌ను తాకడంతో అవుటయ్యాడు. అందుకే ఈసారి కోహ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తపడాలని చూస్తున్నాడు.
తీపి జ్ఞాపకం కూడా ఇదే పిచ్‌పైనే
అయితే ఈ పిచ్ నంబర్-6 కోహ్లీకి కేవలం నిరాశను మాత్రమే ఇవ్వలేదు, అంతకు మించిన అపరిమితమైన ఆనందాన్ని కూడా అందించింది. గత ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ తన చరిత్రలోనే మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది సరిగ్గా ఇదే పిచ్‌పైనే. ఆ హై-ప్రెజర్ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 43 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి పునాది వేశాడు. కాబట్టి ఆ పాత విజయ సూత్రాన్ని, సెంటిమెంట్‌ను గుర్తుచేసుకుంటూ బెంగళూరు టీమ్ ఈసారి కూడా కప్ కొట్టాలని కసిగా ఉంది.
పిచ్ రికార్డులు ఏం చెబుతున్నాయి?
ఈ పిచ్ స్వభావాన్ని పరిశీలిస్తే.. ఇది ఒక మిక్స్డ్ సాయిల్ పిచ్. అంటే దీనిని నల్ల మట్టి, ఎర్ర మట్టిని కలిపి ప్రత్యేకంగా తయారుచేశారు. దీనివల్ల ఈ పిచ్ బ్యాటింగ్‌కు, బౌలింగ్‌కు సహకరిస్తుంది. ఇక్కడ సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. కానీ నరేంద్ర మోదీ స్టేడియంలోని మిగతా పిచ్‌లతో పోలిస్తే.. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు కాస్త తక్కువగా ఉంటుంది. గణాంకాల ప్రకారం 2025 నుంచి ఇక్కడ జరిగిన ఐపీఎల్, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 199 పరుగులుగా ఉంది.
టాస్ గెలిస్తే బ్యాటింగా? ఛేజింగా?
అహ్మదాబాద్ గ్రౌండ్ లో సాధారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ శాతం విజయాలు సాధిస్తుంటాయి. కానీ ఈ పర్టికులర్ 6వ నంబర్ పిచ్‌పై మాత్రం మొదట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు, ఛేజింగ్ చేసిన టీమ్స్ 3 సార్లు గెలిచి 3-3 తో సమంగా ఉన్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో అహ్మదాబాద్‌లో జరిగిన 7 మ్యాచ్‌లలో.. 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్, 3 సార్లు ఛేజింగ్ టీమ్స్ గెలిచాయి. గత ఏడాది ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసి ఇక్కడే గెలవగా.. ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి ఓడిపోయింది. అందువల్ల ఈ పిచ్‌పై టాస్ గెలిచిన కెప్టెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
